Share News

రఘురామ కేసులో కొత్త ట్విస్ట్.. మెడికల్ రిపోర్టులు సమర్పించాలని హైకోర్టు ఆదేశం

ABN , Publish Date - Jun 16 , 2026 | 08:04 PM

మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకి సంబంధించిన కస్టోడియల్ టార్చర్ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా రఘురామకు సంబంధించిన పూర్తి మెడికల్ రిపోర్టులను కోర్టు ఎదుట సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.

రఘురామ కేసులో కొత్త ట్విస్ట్.. మెడికల్ రిపోర్టులు సమర్పించాలని హైకోర్టు ఆదేశం
Raghu Rama Krishna Raju Custodial Torture Case

అమరావతి, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి తెలుగుదేశం ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజుకి (Raghu Rama Krishna Raju) సంబంధించిన కస్టోడియల్ టార్చర్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు(మంగళవారం) ఈకేసుపై విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని మెడికల్ రిపోర్టులను తమ ముందుంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన మెడికల్ బోర్డు నివేదికలు, వైద్య పరీక్షల పూర్తి రికార్డులు, ఇతర సంబంధిత పత్రాలను కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. సీఐడీ అధికారులు తనను కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని రఘురామ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై న్యాయస్థానం ఆదేశాల మేరకు మెడికల్ బోర్డు, వివిధ విభాగాధిపతులు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలను తారుమారు చేయడానికి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రయత్నిస్తున్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.


అలాగే, తప్పుడు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ బోర్డును రక్షించేందుకు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రయత్నిస్తున్నారని కూడా పిటిషన్‌లో రఘురామ ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో గతంలోనే సంబంధిత మెడికల్ రిపోర్టులను భద్రపరచాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఆ రికార్డులన్నింటినీ న్యాయస్థానం ముందుంచాలని మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. అప్పటిలోగా అన్ని వైద్య రికార్డులు, మెడికల్ బోర్డు నివేదికలు, సంబంధిత పత్రాలను సమర్పించాలని అధికారులను ఆదేశించింది. ఈ కేసులో మెడికల్ ఆధారాలు కీలకంగా మారనున్న నేపథ్యంలో ఏపీ హైకోర్టు తాజా ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధిపై చర్చ

ఢిల్లీలో జనసేన సేన ప్రస్థానం సమావేశం.. 5 తీర్మానాలకు ఆమోదం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 16 , 2026 | 09:04 PM