Satya Kumar: ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అంతా భాగస్వామ్యం కావాలి..
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:12 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓపీ, ఐపీ, ఇతర సేవలు గతంతో పోలిస్తే 12శాతం పెరిగాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. రోగులు అధిక శాతం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేలా చేయగలిగామని పేర్కొన్నారు..
విజయవాడ, జనవరి9 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (AP Health Minister Satya Kumar Yadav) పిలుపునిచ్చారు. ఇవాళ(శుక్రవారం) ఏపీ వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లు, బోధనాస్పత్రుల ప్రిన్సిపాళ్లతో మంత్రి.. ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. మెరుగైన ఆరోగ్య సేవలు, నాణ్యమైన వైద్య, విద్య అందించాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో వైద్య రంగంలో ప్రతికూలతలు ఎదుర్కొంటూనే సేవలందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఓపీ, ఐపీ, ఇతర సేవలు పెరిగాయి..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓపీ, ఐపీ, ఇతర సేవలు గతంతో పోలిస్తే 12శాతం పెరిగాయని చెప్పుకొచ్చారు. రోగులు అధిక శాతం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేలా చేయగలిగామని వ్యాఖ్యానించారు. డాక్టర్లు, మందులు, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. కింది స్థాయిలో 28శాతం అవినీతి ఉందని తెలుస్తోందన్నారు. పారిశుద్ధ్యంలో ఇంకా మార్పు రావాల్సి ఉందని తెలిపారు. బోధనాస్పత్రుల్లో అనుమతించిన బెడ్లు 500 వరకూ ఉంటున్నాయని వివరించారు. ఆస్పత్రుల్లో రోగులకు సరిపడా మంచాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లోనూ మార్పులురావాల్సి ఉందని చెప్పుకొచ్చారు. వాట్సాప్ గవర్నెన్స్‌లో వైద్య సేవలు అందుబాటులోకి రావాల్సి ఉందని తెలిపారు. ABHA యాప్ ఐడీ జనరేట్ చేసేలా చూడాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు.
క్షేత్రస్థాయిలో సూపరింటెండెంట్‌లు ఉండాలి..
చాలాచోట్ల FMOలు లేకపోవడం ప్రధాన అంశంగా కనిపిస్తోందని అన్నారు. సూపరింటెండెంట్‌లు, అడ్మినిస్ట్రేషన్ మధ్యలో సరైన కోఆర్డినేషన్ ఉండట్లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అనంతపురంలోని ఆస్పత్రుల్లో చాలా అంశాల్లో లోపాలు తన దృష్టికి వస్తుంటాయని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సూపరింటెండెంట్‌లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్ వెల్‌నెస్ వైపు ప్రభుత్వ వైద్యులు అందరూ ఆలోచించాలని కోరారు. ఆరు నెలలు సెకండరీ ఆస్పత్రుల్లో, ఆరు నెలలు బోధన ఆసుపత్రుల్లో పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సొంతూళ్లలో పని చేయాలని చూసేవారు అటెండెన్స్ తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. కొత్త బోధనాస్పత్రులకు ఇంకా నిర్మాణమే మొదలవలేదని చెప్పుకొచ్చారు. VIMSని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీగా చేయాలంటే రూ.1000 కోట్లు కావాలని అన్నారు. గత జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు ఏమీ చేయలేదని.. ఇప్పుడు అన్నీ కావాలంటే కొంత సమయం పడుతుందని తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్ సాధించాలంటే ప్రధాన భూమిక డాక్టర్లదేనని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
ఆస్పత్రుల పరిస్థితి మారాల్సి ఉంది: సౌరభ్ గౌర్
మూడు నెలల్లో ఆస్పత్రుల పరిస్థితి మారాల్సి ఉందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సెక్రెటరీ సౌరభ్ గౌర్ సూచించారు. ఆరు నెలల్లో అత్యుత్తమ ఆస్పత్రులుగా మారాలని పేర్కొన్నారు. సంజీవనిలో పౌరులకు ఇచ్చే సేవలు తెలియాలని చెప్పుకొచ్చారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు లక్షకు పైగా రోగులు వస్తారని అన్నారు. ఆక్సిజన్ సప్లై, ఇతర సదుపాయాలు ప్రైవేటు సెక్టార్ నుంచి వినియోగిస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ విషయంలోనూ ప్రైవేటు ఆస్పత్రులు పని చేస్తున్నాయని వివరించారు.
ఉద్యోగులకు ప్రొమోషన్లు..
ఏపీ వ్యాప్తంగా మొత్తం ఆస్పత్రుల్లో ఇప్పటి వరకూ.. 144శాతం ఔట్ పేషెంట్ సేవలు అందించామని చెప్పారు. ఈ నెలాఖరులోగా అన్ని రకాల స్థాయిల్లోని ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తామని చెప్పుకొచ్చారు. 140శాతం సర్జరీలు మన ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగాయని వివరించారు. పిల్లల డెలివరీలు అన్ని ఆస్పత్రుల్లో పెంచాల్సి ఉందని తెలిపారు. ABHA యాప్ పూర్తి స్థాయిలో డౌన్‌లోడ్ అయ్యేలా చూడాలని సూచించారు. ఇప్పటి వరకూ 96 శాతం మంది ABHA యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని వెల్లడించారు. మరమ్మతులు చేయాల్సిన పరికరాలను వెంటనే చేయించాలని చెప్పుకొచ్చారు. నెల రోజుల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని అన్నారు. పారిశుద్ధ్యం, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్, వీల్ ఛైర్లు, స్ట్రెచర్లు, పడకలు.. అన్నీ మారాలని సౌరభ్ గౌర్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం..
శిశువుల విక్రయం కేసులో కొత్త కోణం.. బయటపడుతున్న ఆ గ్యాంగ్ లింకులు
Read Latest AP News And Telugu News