ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. భవన నిర్మాణదారులకు ఊరట
ABN , Publish Date - Apr 21 , 2026 | 08:31 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవన నిర్మాణదారులకు, భూ యజమానులకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఖాళీ స్థలాలపై పన్ను చెల్లింపు విధానంలో సవరణలు చేస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) భవన నిర్మాణదారులకు, భూ యజమానులకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఖాళీ స్థలాలపై పన్ను చెల్లింపు విధానంలో సవరణలు చేస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన చట్ట సవరణలకు అనుగుణంగా, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ అధికారిక జీవోను విడుదల చేశారు. దీని ప్రకారం భవన నిర్మాణ సమయంలో చెల్లించాల్సిన ఖాళీ స్థలం పన్నుపై 50 శాతం రాయితీ లభించనుంది.
పన్ను రాయితీ ఎప్పటి వరకు?
భవన నిర్మాణ అనుమతి పొంది, నిర్మాణం ప్రారంభించిన సమయం నుంచి ఆ భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ అయ్యే వరకు ఈ 50 శాతం రాయితీ వర్తిస్తుంది. గతంలో నిర్మాణం జరుగుతున్న సమయంలో కూడా పూర్తి స్థాయిలో పన్ను చెల్లించాల్సి వచ్చేది, ఇప్పుడు ఆ భారాన్ని ప్రభుత్వం సగానికి తగ్గించింది.
చట్ట సవరణ నేపథ్యమిదే..
మున్సిపల్ చట్టాల్లోని నిబంధనల వల్ల నిర్మాణదారులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించిన ప్రభుత్వం, రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి, సామాన్యులపై భారం తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు చట్ట సవరణ బిల్లును ఆమోదించారు.
ప్రయోజనాలు ఎవరికి..?
పెద్ద ప్రాజెక్టులు నిర్మించే సమయంలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రావడానికి ఏళ్ల సమయం పడుతుంది. అప్పటివరకు ఖాళీ స్థలం పన్ను భారం సగానికి తగ్గడం వల్ల ప్రాజెక్టు వ్యయం తగ్గుతుంది. వ్యక్తిగత గృహ నిర్మాణదారులకు కూడా ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ నిర్ణయం వల్ల భవన నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. నిర్మాణ అనుమతి పొందిన తర్వాత మాత్రమే ఈ 50 శాతం రాయితీ వర్తిస్తుంది. కేవలం ఖాళీగా ఉంచిన స్థలాలకు (నిర్మాణ అనుమతి లేనివి) యథావిధిగా పూర్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత, ఆ స్థలం పన్ను రద్దయి, భవన పన్ను అమల్లోకి వస్తుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై నిర్మాణ రంగ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా బిల్లును డీఎంకే అడ్డుకుంది.. సీఎం చంద్రబాబు ధ్వజం
అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించే విజనరీ లీడర్ చంద్రబాబు: జనార్దన్ రెడ్డి
జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం
Read Latest AP News And Telangana News And International News And Telugu News