Share News

పదోన్నతుల వ్యవహారంలో అహ్మద్ బాబుపై హైకోర్టు ఆగ్రహం.. ఉద్యోగుల ఆందోళనలు

ABN , Publish Date - Apr 30 , 2026 | 08:58 PM

ఏపీ వాణిజ్య పన్నుల శాఖలో పదోన్నతుల విషయంలో నెలకొన్న వివాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఐఏఎస్ అధికారి, ఏపీ పన్నుల ప్రధాన కమిషనర్ అహ్మద్ బాబు తీరుపై ఉద్యోగ సంఘాలు, రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

పదోన్నతుల వ్యవహారంలో  అహ్మద్ బాబుపై హైకోర్టు ఆగ్రహం.. ఉద్యోగుల ఆందోళనలు
IAS Ahmed Babu

అమరావతి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ఏపీ వాణిజ్య పన్నుల శాఖలో (Commercial Tax Department) పదోన్నతుల విషయంలో నెలకొన్న వివాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఐఏఎస్ అధికారి, ఏపీ పన్నుల ప్రధాన కమిషనర్ అహ్మద్ బాబు తీరుపై ఉద్యోగ సంఘాలు, ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వాణిజ్య పన్నుల శాఖలో అర్హులైన వారికి పదోన్నతులు కల్పించకుండా అహ్మద్ బాబు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు నిరసనలు తెలుపుతున్నారు.


ఆయా కార్యాలయాల్లో ‘మాకొద్దు ఈ అహ్మద్ బాబు’ అంటూ నినాదాలు చేస్తూ వినూత్నంగా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీరును ‘నియంతృత్వ పోకడ’గా ఉద్యోగ సంఘాలు అభివర్ణిస్తున్నాయి. డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (DPC) ఒక అభ్యర్థి పదోన్నతికి ఆమోదం తెలిపిన తర్వాత, దానిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. అయితే, కె.ఆర్. సూర్యనారాయణ అనే ఉద్యోగికి సంబంధించి డి.పి.సి ఆమోదం పొందినా, అహ్మద్ బాబు కావాలనే ఆ పదోన్నతిని తొక్కిపెట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


హైకోర్టు ఆదేశాల ధిక్కారణ..

ఈ వివాదంపై కె.ఆర్. సూర్యనారాయణ గతంలోనే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సూర్యనారాయణకు పదోన్నతి కల్పించాలని హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశించినప్పటికీ, అహ్మద్ బాబు ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో సూర్యనారాయణ కోర్టు ధిక్కరణ (Contempt of Court) పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా, సూర్యనారాయణ పదోన్నతికి సంబంధించిన పూర్తి డి.పి.సి రికార్డులను తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది.


అయినప్పటికీ, అహ్మద్ బాబు ఆ రికార్డులను కోర్టుకు సమర్పించకపోవడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. రేపు (శుక్రవారం) హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసుపై కీలక విచారణ జరగనుంది. ప్రభుత్వ నిబంధనలు, న్యాయస్థాన ఉత్తర్వులను ఒక ఉన్నతాధికారి బేఖాతరు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం జరగబోయే విచారణలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అటు ఉద్యోగ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి...

ఇంధనం కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రంగంలోకి యంత్రాంగం..

పెట్టుబడులతో ఏపీ కొత్త చరిత్ర సృష్టిస్తోంది: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 30 , 2026 | 09:02 PM