Share News

జనం ఛీకొట్టినా జగన్‌ అంతే

ABN , Publish Date - Aug 01 , 2026 | 07:58 AM

ప్రజలు ఛీకొట్టినా జగన్‌ తీరు మాత్రం మారడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం జగన్‌ లాంటి నేర మనస్తత్వం ఉన్న రాజకీయ నాయకులకు ఏమాత్రం ఇష్టం ఉండదన్నారు.

జనం ఛీకొట్టినా జగన్‌ అంతే
AP CM Chandrababu Naidu

  • రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యం

  • నిత్యం ఏదో ఒక అలజడి సృష్టిస్తున్నారు

  • విధ్వంస యాత్రలు చేయడం ఏంటో

  • టీడీపీలో అందరికీ పార్టీయే సుప్రీం

  • పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు

  • మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఎవరైనా

  • ఒకటికి రెండుసార్లు చెప్పి చూస్తాం

  • ఆ తర్వాత కఠిన చర్యలు తప్పవు

  • పార్టీ శ్రేణులతో సీఎం చంద్రబాబు

అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఛీకొట్టినా జగన్‌ తీరు మాత్రం మారడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం జగన్‌ లాంటి నేర మనస్తత్వం ఉన్న రాజకీయ నాయకులకు ఏమాత్రం ఇష్టం ఉండదన్నారు. అందుకే నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం పార్టీ యూనిట్‌ ఇన్‌చార్జ్‌ల శిక్షణ తరగతులకు హాజరై, కాఫీ కబుర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి కొత్తపుంతలు తొక్కనుందన్నారు.


విమానాశ్రయంతో పాటు ఆర్సెలార్‌ మిట్టల్‌, గూగుల్‌ డేటా సెంటర్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఉత్తరాంధ్రకు వచ్చాయన్నారు. రాయలసీమ ప్రాంతం పునరుత్పాదక ఇంధన హబ్‌గా రూపొందుతోందని, పారిశ్రామికంగానూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కోస్తా ప్రాంతంలో రాజధానితో పాటు పలు సంస్థలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇంత చేస్తున్నా విపక్ష నేతగా జగన్‌ రాష్ట్రాభివృద్ధికి మరింత నిర్మాణాత్మక సూచనలు చేయాల్సింది పోయి అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకునేలా అలజడులు సృష్టిస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి తలమానికమైన భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించుకుంటున్న వేళ జగన్‌ వందల మందిని పోగేసి విధ్వంస యాత్రలు చేయడం ఏమిటన్నారు.


పార్టీకి నష్టం కలిగించే పనులు చేయొద్దు

అధినేత మొదలు సాధారణ కార్యకర్త వరకు ప్రతి ఒక్కరికీ పార్టీయే సుప్రీం అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరైనా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాల్సిందేనని అన్నారు. ఈ నియమాన్ని ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా సహించేది లేదని హెచ్చరించారు. పార్టీ లైన్‌ దాటిన వారు మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా.. ఎవరినైనా పిలిపించి మాట్లాడుతామని స్పష్టం చేశారు. ఒకటికి రెండుసార్లు చెప్పి చూస్తామని, ఆ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీకి నష్టం కలిగించే వారిని పక్కన పెట్టేందుకు వెనుకాడబోనన్నారు. ఏ రూపంలోనూ పార్టీకి నష్టం కలిగించే పనులు చేయవద్దని పార్టీ శ్రేణులను ఆదేశించారు.

Updated Date - Aug 01 , 2026 | 08:02 AM