Share News

అమరావతికి చట్టబద్ధత.. క్యాబినెట్ కీలక తీర్మానం

ABN , Publish Date - Mar 26 , 2026 | 06:19 PM

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ పునర్విభజన చట్టంలో సవరణలతో పాటు, అమరావతిని శాశ్వత రాజధానిగా కొనసాగించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించింది.

అమరావతికి చట్టబద్ధత.. క్యాబినెట్ కీలక తీర్మానం
Amaravati Legal Status

అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి క్యాబినెట్ బ్రీఫింగ్‌లో ఈ విషయాలను వెల్లడించారు.


శాశ్వత రాజధానిగా అమరావతి

ఏపీ పునర్విభజన చట్టం–2014లోని సెక్షన్-5ను సవరించి, సీఆర్డీఏ పరిధిలోని అమరావతిని రాష్ట్ర రాజధానిగా చేర్చాలని మంత్రివర్గం తీర్మానించింది. భవిష్యత్తులో ఎవరూ రాజకీయ కారణాలతో రాజధానిని మార్చకుండా ఉండేందుకు అసెంబ్లీలో కూడా ప్రత్యేక తీర్మానం చేయాలని నిర్ణయించింది. గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతిని దెబ్బతీసిందని విమర్శించిన మంత్రి, ఇప్పుడు శాశ్వత రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అమరావతిని రాష్ట్ర ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఉద్యోగాల కేటాయింపునకు ఆమోదం

ఇక న్యాయ వ్యవస్థ బలోపేతానికి హైకోర్టు సూచనల మేరకు 96 కొత్త కోర్టుల ఏర్పాటు, 1730 ఉద్యోగాల కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నియామకాలను జాబ్ క్యాలెండర్‌లో చేర్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వడ్డెర సొసైటీలకు 15 శాతం క్వారీ లీజులు కేటాయిస్తూ, సీనరేజీపై 50 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. కుప్పంలో మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్‌లో సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


సింగిల్ టైం సెటిల్‌మెంట్

పట్టణాల్లో పెండింగ్ పన్ను బకాయిల పరిష్కారానికి సింగిల్ టైం సెటిల్‌మెంట్ విధానానికి ఆమోదం తెలిపారు. అదే సమయంలో పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి పునరావాస భూముల విలువ పెంపుతో పాటు, ఎకరాకు పరిహారం రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచారు. ఇందుకు రూ.565 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. అలాగే పోలవరం లిఫ్ట్ స్కీమ్ పనుల కొనసాగింపుకు అనుమతి ఇచ్చిన మంత్రివర్గం, కర్నూలు జిల్లా గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్‌లో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు నిధులు మంజూరు చేసింది.

పీఎన్‌జీ కనెక్షన్లు పెంపు

పట్టణాల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లను 9 లక్షల వరకు పెంచేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. పీఎన్‌జీ వినియోగదారులకు దీపం పథకం కింద రాయితీలు కొనసాగించనున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న బస్సు ప్రమాదాలపై కూడా క్యాబినెట్ చర్చించి రోడ్ల నాణ్యత, వాహనాల అనుమతులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

అగ్ని ప్రమాదాలపై విచారణ

ఇక అమరావతిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించింది. కొన్ని ఘటనలు ఉద్దేశపూర్వకంగా జరిగి ఉండొచ్చని భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మొత్తానికి, అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టడమే కాకుండా, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంగా మార్చడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుపతి ఎస్‌‌ఐహెచ్ఎం సిబ్బంది వేతన కష్టాలకు తెర

మార్కాపురం బస్సు ప్రమాదం.. పలువురిని కాపాడిన బాలరాజు

For More Latest News

Updated Date - Mar 26 , 2026 | 06:24 PM