జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్రంతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ
ABN , Publish Date - Mar 24 , 2026 | 01:16 PM
జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకాలు చేశారు.
అమరావతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకాలు చేశారు. పల్లెల్లో ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించాలనేది జల్ జీవన్ మిషన్ 2.0 లక్ష్యం. ఢిల్లీలో జరిగిన ఎంవోయూ కార్యక్రమంలో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్, క్యాంప్ కార్యాలయం నుంచి జూమ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు, వర్చువల్‌గా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
2028 డిసెంబర్ నాటికి ‘హర్ ఘర్ జల్’ సాకారం చేసేలా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఓయూ చేసుకున్నాయి. జేజేఎంను 2028 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సేవలు, ప్రజల భాగస్వామ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. జల్ జీవన్ మిషన్ కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం: సీఆర్ పాటిల్
జల్ జీవన్ మిషన్ 2.0లో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం అనంతరం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ మాట్లాడారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు జల్ జీవన్ మిషన్ 2.0కు అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీతో ఈ విషయంపై సంప్రదించారని తెలిపారు. ఈ మిషన్ పొడిగింపు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
జల్ జీవన్ మిషన్ కార్యక్రమం మొదటి దశలో 16 కోట్ల మంది గృహాలకు కొళాయిలు ఇచ్చామని ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టులో జరిగిన కొన్ని లోపాలను సవరించి నిర్వహణ కూడా చేపడుతున్నామని వివరించారు. మరో 3 కోట్ల ఇళ్లకు సురక్షితమైన తాగునీటిని అందించాల్సి ఉందని తెలిపారు. 2024 కంటే ముందు మంజూరైన పథకానికి అనుగుణంగానే ఈ మిషన్ పొడిగించినట్లు వెల్లడించారు. ఏపీలో నీటి నాణ్యతను పరీక్షించేందుకు చర్యలు చేపట్టామని సీఆర్ పాటిల్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. జాబ్ క్యాలెండర్, ఉద్యోగ సమస్యలపై వినతులు
అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఐకానిక్ కట్టడాలు: మంత్రి నారాయణ
నా కుమారుడు మహేశ్ యాదవ్‌కు ఎలాంటి డ్రగ్స్ అలవాట్లు లేవు: పుట్టా సుధాకర్
Read Latest AP News And Telangana News And International News And Telugu News