Share News

ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ABN , Publish Date - May 12 , 2026 | 04:18 PM

ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ స్టేట్ వెల్ఫేర్ బోర్డుకు కొత్త సభ్యులను నియమిస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
AP Government

అమరావతి, మే 12 (ఆంధ్రజ్యోతి): ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ స్టేట్ వెల్ఫేర్ బోర్డుకు కొత్త సభ్యులను నియమిస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్‌జెండర్ హక్కుల పరిరక్షణ చట్టం-2019 ప్రకారం ఈ నియామకాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.


ప్రాంతాల వారీగా కలెక్టర్ల నియామకం

రాష్ట్రంలోని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించేలా కలెక్టర్లను ప్రభుత్వం నామినేట్ చేసింది. విశాఖపట్నం కలెక్టర్‌ను ఆంధ్ర ప్రాంతానికి ప్రతినిధిగా నియమించగా, తిరుపతి కలెక్టర్‌ను రాయలసీమ ప్రాంతానికి ప్రతినిధిగా నియమించింది. ఈ నిర్ణయం ద్వారా ప్రాంతీయ స్థాయిలో ట్రాన్స్‌జెండర్ సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలు మరింత సమర్థవంతంగా జరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.


ట్రాన్స్‌జెండర్ ప్రతినిధులకు అవకాశం..

ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ స్టేట్ వెల్ఫేర్ బోర్డులో నామినేట్ సభ్యులుగా ముగ్గురు ట్రాన్స్‌జెండర్ ప్రతినిధులకు అవకాశం కల్పించింది. కోట ప్రేమ్ సాగర్ రాయ్, నక్క జీవన్ కుమారి, బోను దుర్గలను బోర్డు సభ్యులుగా నియమించింది. ఈ నియామకాల ద్వారా ట్రాన్స్‌జెండర్లకు సంబంధించిన సమస్యలు నేరుగా ప్రభుత్వ దృష్టికి వెళ్లే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.


రెండేళ్ల పదవీకాలం

ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, నియమిత సభ్యుల పదవీకాలం రెండేళ్ల పాటు ఉంటుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నియామకాలు అమల్లో ఉంటాయని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది.


జీఓ ఎంఎస్ నంబర్14 విడుదల

మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జీఓ ఎంఎస్ నంబర్14 విడుదల చేసింది. ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ట్రాన్స్‌జెండర్ సంక్షేమానికి ప్రాధాన్యం

రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లకు విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక భద్రత వంటి అంశాల్లో మరింత సహకారం అందించేందుకు చర్యలు చేపడుతోంది. ట్రాన్స్‌జెండర్ హక్కుల పరిరక్షణ చట్టం-2019 అమల్లో భాగంగా సంక్షేమ బోర్డు కీలక పాత్ర పోషించనుంది. సమాజంలో ట్రాన్స్‌జెండర్లకు సమాన హక్కులు, గౌరవం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.


ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుపై రాయపాటి శైలజ హర్షం..

Rayapati-Sailaja.jpg

ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డుకు సభ్యులను నియమించడంపై ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు(మంగళవారం) అమరావతి వేదికగా శైలజ మీడియాతో మాట్లాడారు. ట్రాన్స్‌జెండర్ల హక్కులు, సంక్షేమంపై కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ట్రాన్స్‌జెండర్ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను మే 4వ తేదీన మంత్రి నారా లోకేశ్ దృష్టికి తాను తీసుకెళ్లానని ప్రస్తావించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ట్రాన్స్‌జెండర్ల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేయడం కూటమి సర్కారు చిత్తశుద్ధికి నిదర్శనమని రాయపాటి శైలజ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

టెక్నాలజీ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు

ప్రజాసమస్యల పరిష్కారానికి పవన్ కల్యాణ్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారు: అన్నామలై

అనధికార లౌడ్‌స్పీకర్లపై డీజీపీకి రఘురామ లేఖ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 12 , 2026 | 04:48 PM