అన్‌స్టాపబుల్‌గా అమరావతి నిర్మాణం.. మంత్రి లోకేశ్ వీడియో పోస్ట్
ABN , Publish Date - Jun 14 , 2026 | 10:58 AM
ఏపీ రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగతున్నాయి. వర్షంలోనూ టాప్ గేర్‌లో నిర్మాణ కార్యకలాపాలు సాగిస్తున్నామని మంత్రి లోకేశ్ స్పష్టం చేస్తూ.. సంబంధిత వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఎలాంటి బ్రేకులు పడే పరిస్థితి లేదని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ రాజధాని ప్రాంతంలో నిరంతరాయంగా నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు లోకేశ్.
అమరావతి పనులు ప్రస్తుతం టాప్ గేర్‌లో సాగుతున్నాయని లోకేశ్ తెలిపారు. రాజధాని అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయట్లేదన్న ఆయన.. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు. వర్షాలు పడితే అమరావతి మునిగిపోయిందంటూ ప్రచారం చేసే వారికి ఈ వీడియో ఓ సమాధానమని వ్యాఖ్యానించారు. 'సారీ బ్రో' అంటూ ట్రోలర్లపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన లోకేశ్.. జోరుగా వానలోనూ నిర్మాణ పనులు కొనసాగుతున్న దృశ్యాలను ప్రజలకు చూపించేందుకే ఈ వీడియోను విడుదల చేశానన్నారు. ఇకనైనా అమరావతి గురించి అసత్య ప్రచారాలు, విష ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.
రాజధాని నిర్మాణంలో ఇకపై పాజ్ అనే మాటకు చోటు లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. నిర్మాణ పనుల వేగం మరింత పెరిగిందని, ఇది నవ్యాంధ్ర భవిష్యత్తుకు బలమైన పునాదవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు.. రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం సహా పనుల్లో వేగం పెంచడం.. రాష్ట్ర ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 'స్పీడ్ పెంచిన అమరావతి.. నవ్యాంధ్ర భవిష్యత్తుకు అసలైన గ్యారంటీ' అని మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇవీ చదవండి:
ఈఎస్ఐ అసోసియేషన్ అధ్యక్షుడిగా శేషగిరిరావు