Share News

బదిలీల పేరుతో బేరాలు

ABN , Publish Date - Jun 14 , 2026 | 06:05 AM

ఆరోగ్య శాఖలోని డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో బదిలీల పేరుతో బేరాలకు తెరతీశారు. ప్రస్తుతం బదిలీలపై నిషేధం ఉన్నప్పటికి అధికారులు..

బదిలీల పేరుతో బేరాలు

  • ఆరోగ్య శాఖలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల దందా

  • ఏడీల నుంచి రూ.15 లక్షలు.. డీఐల నుంచి 10 లక్షలు

  • బదిలీలపై నిషేధమున్నా చేయాలని నిర్ణయం

  • ఫైల్‌ ఆగమేఘాల మీద హెల్త్‌ సెక్రటరీకి రెండు, మూడు రోజుల్లో ఆమోదం దిశగా..

అమరావతి, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య శాఖలోని డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో బదిలీల పేరుతో బేరాలకు తెరతీశారు. ప్రస్తుతం బదిలీలపై నిషేధం ఉన్నప్పటికి అధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. మూడేళ్లు దాటిన జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్లు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు ఏడీలు, 13 మంది డీఐలు మూడేళ్ల నుంచి ఒకే స్థానంలో విధులు నిర్వహిస్తున్నారు. వీరందరిని బదిలీ చేయాలని అధికారులు అంతర్గత ఫైల్‌ సిద్ధం చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన ఫైల్‌ ఆగమేఘాల మీద హెల్త్‌ సెక్రటరీకి చేరింది. రెండు, మూడు రోజుల్లో దీనికి ఆమోదం లభించనుంది. ప్రభుత్వం నిషేధించిన సమయంలో బదిలీలు చేపట్టడం వెనుక మతలబు ఏమిటన్నది ప్రశ్నగా మారింది. బదిలీల పేరుతో తెరవెనుక భారీ స్కెచ్‌ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఏడీలు, డీఐలకు కావాల్సిన చోట పోస్టింగ్‌లు ఇచ్చేందుకు భారీగా వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం, ఏడీలకు కావాల్సిన పోస్టింగ్‌ ఇచ్చేందుకు రూ.10-15 లక్షలు వసూళ్లు చేస్తున్నారు. అలాగే డీఐల పోస్టింగ్‌లు రూ.5-10 లక్షల వరకూ బహిరంగంగానే అడుగుతున్నారు. రెండు, మూడు రోజుల్లో బేరాలు పూర్తి చేసుకుని, ఆ తర్వాత బదిలీల ఆర్డర్లు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఆరోగ్య శాఖలో అవినీతిని కంట్రోల్‌ చేయాలని ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. కొంత మంది అధికారులు తమ జేబులు నింపుకోవడానికి నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.

Updated Date - Jun 14 , 2026 | 06:09 AM