పరువు పాయే!
ABN , Publish Date - Mar 08 , 2026 | 07:43 AM
ఏపీ 'విజయ' బ్రాండ్‌పై కల్తీ ఆరోపణలు ముసురుకుంటున్నాయి. తెలంగాణలో అమ్ముతున్న ఈ బ్రాండ్ నెయ్యి కల్తీ అయినట్లు వెల్లడైంది. ఆధారాలను ఆ రాష్ట్ర డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తాజాగా బయటపెట్టారు.
తెలంగాణలో ఏపీ ‘విజయ’ బ్రాండ్ నెయ్యి కల్తీ
అందులో వెజిటబుల్ ఆయిల్స్, రసాయనాలు
గుజరాత్‌లోని డెయిరీలో తయారుచేసి అమ్మకాలు
టి-డెయిరీ సమాఖ్య చైర్మన్ అమిత్ రెడ్డి ఆరోపణలు
జగన్ ప్రభుత్వంలో ఫ్రాంచైజీ హక్కులు ప్రైవేటుకు
బ్రాండ్ పేరు దుర్వినియోగం చేసిన యాజమాన్యం
అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ఏపీ 'విజయ' బ్రాండ్‌పై (Vijaya Dairy) కల్తీ ఆరోపణలు ముసురుకుంటున్నాయి. తెలంగాణలో అమ్ముతున్న ఈ బ్రాండ్ నెయ్యి కల్తీ అయినట్లు వెల్లడైంది. ఆధారాలను ఆ రాష్ట్ర డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తాజాగా బయటపెట్టారు. ఏపీ డెయిరీ ఉత్పత్తుల హక్కులను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడమే కల్తీకి కారణమని తెలిపారు. ఏపీ పాల సేకరణతో సంబంధం లేకుండా గుజరాత్‌లో నెయ్యి తయారు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెయ్యిని జాతీయ ల్యాబ్‌కు పంపి పరీక్షలు చేయించడంతో వెజిటబుల్ ఆయిల్స్, రసాయనాలు ఉన్నట్లు తేలిందన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్ సంస్థతో పాటు ఏపీ డెయిరీ ఫెడరేషన్‌పైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అమిత్ రెడ్డి హెచ్చరించారు. ఏపీ విజయ డెయిరీ పేరుతో విక్రయించే ఉత్పత్తులను అడ్డుకుంటామని పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వ నిర్వాకమే
ప్రజల్లో సమ్మకం, విశ్వసనీయత పొందిన విజయ బ్రాండ్ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినది. రాష్ట్ర విభజన తర్వాత ఈ బ్రాండ్‌పై ఇరు రాష్ట్రాలకు హక్కులు సంక్రమించాయి. తెలంగాణలో సహకార రంగంలో పనిచేస్తున్న విజయ డెయిరీ.. అక్కడి రైతుల నుంచి పాలు సేకరించి, పాలు, పాల ఉత్పత్తులను ప్రజలకు అందిస్తోంది. ఏపీలో మాత్రం సహకార డెయిరీ వ్యవస్థ నిర్వీర్యమై, జిల్లా యూనియన్లుగా విడిపోయాయి. ఇక్కడ పాల సేకరణ వ్యవస్థ బలంగా లేకపోవడంతో పాలు, పాల ఉత్పత్తులను విజయ బ్రాండ్‌తో ప్రాసెసింగ్ మార్కెటింగ్ చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో గత ప్రభుత్వం హైదరాబాద్‌కు చెందిన మేఘన ఫుడ్స్ అనే సంస్థకు విజయ బ్రాండ్‌పై ఫ్రాంచైజీ హక్కులు కల్పించడం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఏపీ డెయిరీ ఫెడరేషన్‌లో కీలక అధికారిని గత ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి మరీ ఫ్రాంచైజీ హక్కులు ఇప్పించినట్లు సమాచారం. అప్పటి ఏపీ సీఎంవోలో ఉన్న అధికారి ఒకరు ఇందులో చక్రం తిప్పారని తెలుస్తోంది.
ఆ ప్రైవేట్ సంస్థ యాజమాన్యం సహకార రంగంతోనూ తెలుగు రాష్ట్రాల రైతులతో సంబంధం లేకుండా అధిక లాభాల కోసం గుజరాత్‌లోని ఓ డెయిరీలో తయారు చేసిన కల్తీ నెయ్యిని తీసుకొచ్చి హైదరాబాద్ పరిసరాల్లో నెలకు 100 టన్నులు విక్రయిస్తోందని అమిత్‌రెడ్డి వెల్లడించారు. నెయ్యి ప్యాకెట్లపై ముందువైపు విజయ బ్రాండ్ అని, వెనుక మరో డెయిరీ పేరు ఉందని తెలిపారు. దానిపై ఉన్న హోలో గ్రామ్ అకౌంట్‌కు లాగిన్ అయితే వేరే కంపెనీ పేరు వస్తోందని, దీంతో నమూనాలను నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు( ఎన్డీడీబీ) ఆధ్వర్యంలోని ల్యాబ్‌కు పంపినట్లు వివరించారు. వెజిటబుల్ ఆయిల్స్, రసాయనాలు కలిసినట్లు నిర్ధారణ అయిందన్నారు.. కాగా, ఏపీ డెయిరీ ఫెడరేషన్ సదరు సంస్థకు మూడేళ్ల క్రితమే ఫ్రాంచైజీ హక్కులు కల్పించింది. దీనికి గాను లీటర్ పాలకు రూపాయి చొప్పున వసూలు చేస్తుందని సమాచారం. ఏపీ విజయ బ్రాండ్‌ను అమ్మకానికి పెట్టిన గత ప్రభుత్వ పెద్దలు రాష్ట్రం పరువు తీశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, విజయ బ్రాండ్‌తో పక్క రాష్ట్రంలో ప్రైవేట్ వ్యాపారులకు ఫ్రాంచైజీ హక్కులు ఇవ్వడంపై వివరణ ఇచ్చేందుకు ఏపీ డెయిరీ ఫెడరేషన్ అధికారులు అందుబాటులోకి రాలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిశోధనలు అనేక జాతీయ సంస్థలకు ఉపయోగం: గవర్నర్ అబ్దుల్ నజీర్
విజయవాడలో కాల్పుల కలకలం.. పోలీసులు, ఈగల్ అధికారులపై ఫైరింగ్
Read Latest International News And Telangana News And AP News And Telugu News