డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. వైసీపీ ఎమ్మెల్సీ భార్యకు ఊరట..
ABN , Publish Date - Mar 30 , 2026 | 07:55 PM
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు జిల్లా కోర్టులో ఊరట లభించింది. లక్ష్మీదుర్గపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్‌ను న్యాయస్థానం రద్దు చేసింది.
రాజమహేంద్రవరం: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు జిల్లా కోర్టులో ఊరట లభించింది. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో లక్ష్మీదుర్గపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్‌ను న్యాయస్థానం రద్దు చేసింది. 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని.. పాస్‌పోర్ట్ అప్పగించాలని లక్ష్మీకి ఆదేశాలు జారీచేసింది కోర్టు. ఈ సందర్భంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల రక్షణపై కాకినాడ జిల్లా ఎస్పీ పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించింది. తనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను రద్దు చేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని లక్ష్మి ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆమె అభ్యర్థనపై సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తీర్పు వెలువరించారు.
తప్పుడు సంకేతాలు: న్యాయవాది..
అయితే, తీర్పు అనంతరం డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబం తరఫు న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ రీకాల్ చేసినంత మాత్రాన కేసు బలహీన పడినట్లు కాదు. మా న్యాయపోరాటం ఆగదు. నిందితులు తప్పించుకోలేరు, శిక్ష తప్పదు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల ఇంటివద్ద గుర్తుతెలియని వ్యక్తులు తిరుగుతున్నారు. నవంబర్ 30లోగా కేసు విచారణ పూర్తై తీర్పు వస్తుంది. నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు తప్పుడు సంకేతాలు తీసుకువెళ్తుంది. హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ పాత్రపై ఆధారాలు ఉన్నాయి' అని తెలిపారు.
రక్షించండి: సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు..
మరోవైపు తమకు ప్రాణహాని ఉందని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూక రత్నం, సత్యనారాయణ ఆరోపించారు. తమ కుమారుడి హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గతోపాటు ఇంకా కొంతమంది పాత్ర ఉందన్నారు. తమ ఇంటి వద్ద కొందరు గుర్తుతెలియని అనుమానాస్పదంగా తిరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ కారు ఢీకొనడంతో తనకు గాయాలయ్యాయని సుబ్రహ్మణ్యం తండ్రి సత్యనారాయణ తెలిపారు. తమ కుటుంబానికి తమకు రక్షణ కల్పించాలని కోర్టును వేడుకున్నారు. దీంతో వారి రక్షణ బాధ్యతను కాకినాడ జిల్లా ఎస్పీ పర్యవేక్షించాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు తీర్పు తమకు నిరాశ కలిగించిందని రిపబ్లిక్(ఎం) పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు పిట్టా వరప్రసాద్ అన్నారు. ఇటువంటి తీర్పుల వల్ల సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
మౌనిక హత్య కేసు నిందితుడు రవీంద్రపై దాడి చేసిన బాధిత కుటుంబం..
అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నారా?.. వైసీపీకి హోంమంత్రి సూటి ప్రశ్న