Purandeswari: చట్టాలు రాతిపై చెక్కిన శిల్పాలు కావు.. ఎంపీ షాకింగ్ కామెంట్స్..
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:34 AM
గ్రామాల్లో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలపై ముందుగా గ్రామ సభల్లో తీర్మానం చేయాలని బీజేపీ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సూచించారు. తాజాగా ఉపాధి హామీ చట్ట సవరణ ద్వారా 15 రోజుల్లోగా కూలి చెల్లించకుంటే జరిమానాతో కలిపి లబ్ధిదారుడికి అందజేస్తామని స్పష్టం చేశారు. విపత్తుల సమయంలోనూ రైతులను, సాధారణ ప్రజలను ఆదుకునేందుకు ఈ నిధులు వినియోగించుకోవచ్చని వివరించారు.
రాజమండ్రి, జనవరి8 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)’ (వీబీ-జీ రామ్ జీ)పై బీజేపీ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (BJP MP Daggubati Purandeswari) కీలక వ్యాఖ్యలు చేశారు. విబ్ జీ రామ్ జీ పథకంపై ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. చట్టాలు రాతిపై చెక్కిన శిల్పాలు కావని అందరూ గుర్తించాలని పేర్కొన్నారు. రాజ్యాంగంలో కూడా అనేక సవరణలు చేసుకున్నామని ప్రస్తావించారు. ఇవాళ (గురువారం) రాజమండ్రిలో పురందేశ్వరి పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు పురందేశ్వరి.
మార్పులు తీసుకొచ్చాం..
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. ఉపాధి హామీ పథకం ద్వారా శాశ్వత నిర్మాణ పనులు పెద్దగా జరగడం లేదని తెలిపారు. అందువల్లే మార్పులు చేయాల్సి వచ్చిందని అన్నారు. పలు రాష్ట్రాల్లో ఈ పథకం ద్వారా కూలీలకు సరైన సమయంలో వేతనాలు అందడం లేదని తెలిపారు. ఈ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని చాలా డిమాండ్లు ఉన్నాయని గుర్తుచేశారు. వికసిత్ భారత్ సాధించాలంటే వికసిత్ గ్రామాలు ఉండాలని చెప్పుకొచ్చారు పురందేశ్వరి.
గ్రామసభల్లో తీర్మానం చేయాలి..
గ్రామాల్లో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలపై ముందుగా గ్రామసభల్లో తీర్మానం చేయాలని సూచించారు. తాజాగా ఉపాధి హామీ చట్టసవరణ ద్వారా 15 రోజుల్లోగా కూలి చెల్లించకుంటే జరిమానాతో కలిపి లబ్ధిదారుడికి అందజేస్తామని స్పష్టం చేశారు. విపత్తుల సమయంలోనూ రైతులను, సాధారణ ప్రజలను ఆదుకునేందుకు ఈ నిధులు వినియోగించుకోవచ్చని వివరించారు. ప్రస్తుతం ఈ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం 60శాతం నిధులు ఇస్తే రాష్ట్రాలు 40శాతం సమకూర్చుకోవాలని సూచించారు పురందేశ్వరి.
నిధుల దుర్వినియోగం..
దీని ద్వారా రాష్ట్రాలపై కూడా బాధ్యత ఉంటుందని తెలిపారు. పశ్చిమబెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లో నిధుల దుర్వినియోగం బయటపడిందని అన్నారు. పనిదినాలు కచ్చితంగా పెంచి చూపిస్తామని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. వ్యవసాయ పనుల సమయంలో ఈ సవరణ ద్వారా పనులను తాత్కాలికంగా నిలుపుదల చేస్తామని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చ
భక్తులకు అలర్ట్.. ఆ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన..
Read Latest AP News And Telugu News