Share News

ISRO PSLV-C62 Mission: ఇస్రో మరో ప్రయోగం.. పీఎస్ఎల్వీ- సీ62 లాంచ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం..

ABN , Publish Date - Jan 11 , 2026 | 01:42 PM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి PSLV-C62 రాకెట్ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది..

 ISRO PSLV-C62 Mission: ఇస్రో మరో ప్రయోగం.. పీఎస్ఎల్వీ- సీ62 లాంచ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం..
ISRO PSLV-C62 Mission

శ్రీహరికోట (ఉమ్మడి నెల్లూరు జిల్లా), జనవరి11(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో ప్రతిష్టాత్మక రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పీఎస్ఎల్వీ–సీ62 (PSLV-C62) రాకెట్ ప్రయోగానికి సంబంధించి మధ్యాహ్నం 12:17 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 22 గంటల పాటు కౌంట్‌డౌన్ కొనసాగనుంది.

నింగిలోకి శాటిలైట్‌..

ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వి–సీ62 రాకెట్ ద్వారా EOS N1 శాటిలైట్‌ను అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రయోగం ద్వారా 8 విదేశీ, 7 స్వదేశీ ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి పంపనున్నారు. ఈ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది.


‘అన్వేషన్’గా నామకరణం..

EOS N1 శాటిలైట్‌కు ఇస్రో శాస్త్రవేత్తలు ‘అన్వేషన్’ అనే నామకరణం చేశారు. ఈ శాటిలైట్ భూపరిశీలనలో అత్యాధునిక సాంకేతికతతో పనిచేయనుంది.

దేశ రక్షణ, విపత్తుల నిర్వహణే కీలకం..

ఈ ఉపగ్రహం ద్వారా భూపరిశీలన (Earth Observation), దేశ రక్షణ రంగానికి అవసరమైన సమాచారం, వాతావరణ మార్పుల అధ్యయనం, తుఫానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులపై ముందస్తు హెచ్చరికలు అందించడంలో కీలక పాత్ర పోషించనుంది. ముఖ్యంగా విపత్తుల సమయంలో సమాచారం వేగంగా అందించడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


జనవరి 12న రాకెట్ ప్రయోగం

ఇస్రో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, జనవరి 12 ఉదయం 10:17 గంటలకు పీఎస్ఎల్వీ–సీ62 రాకెట్ షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలు వీక్షించనున్నారు.

షార్‌లో కట్టుదిట్టమైన భద్రత..

రాకెట్ ప్రయోగం నేపథ్యంలో షార్ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు ప్రతి దశనూ జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. పీఎస్ఎల్వీ–సీ62 ద్వారా EOS N1 (అన్వేషన్) శాటిలైట్ ప్రయోగం భారత అంతరిక్ష రంగానికి మరో గర్వకారణంగా నిలవనుంది. దేశ రక్షణ, వాతావరణ అధ్యయనం, విపత్తుల నిర్వహణలో ఈ శాటిలైట్ కీలక పాత్ర పోషించనుంది. షార్‌లో జరుగుతున్న ఈ ప్రయోగంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి...

నెల్లూరు ఓఆర్ఆర్‌పై మంత్రి నారాయణ క్లారిటీ..

స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని లక్ష్యాలు సాధించాలి: మంత్రి సత్యకుమార్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 11 , 2026 | 03:30 PM