ప్రపంచస్థాయి రైల్వేస్టేషన్‌గా తిరుపతి
ABN , Publish Date - Mar 04 , 2026 | 10:48 AM
పాతికేళ్ల కిందట వరకు అప్పటి రద్దీకి తగ్గట్టుగా తిరుపతి మీదుగా 20 రైళ్లు రాకపోకలు సాగించేవి. తర్వాత తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు సామాన్య ప్రయాణికుల సంఖ్య అమాంతంగా పెరిగింది. ఈ రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్య పెంచాల్సి వచ్చింది.
వచ్చే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రూ.321కోట్లతో నిర్మాణాలు
దేశంలోనే భోపాల్ తర్వాత ఇక్కడే..
రెండు ఎయిర్ కౌన్ కోర్సుల ఏర్పాటు
మార్చిలో దక్షిణ భవనం ప్రారంభం
డిసెంబరులో అందుబాటులోకి వానున్న ఉత్తర భవనం
పాతికేళ్ల కిందట వరకు అప్పటి రద్దీకి తగ్గట్టుగా తిరుపతి మీదుగా 20 రైళ్లు రాకపోకలు సాగించేవి. తర్వాత తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు సామాన్య ప్రయాణికుల సంఖ్య అమాంతంగా పెరిగింది. ఈ రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్య పెంచాల్సి వచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల నుంచి తిరుపతి మీదుగా వెళ్లే రైళ్ల సంఖ్యను ఏటా పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం రోజుకు 102 రైళ్లు నడుస్తున్నాయి. రైల్వేస్టేషన్ (Tirupati Railway Station) పలుమార్లు ఆధునికీకరించినా ప్రయాణికులకు అనుకూలంగా లేదు.
స్థలాభావంతో సౌకర్యాల కొరతగానే ఉంటోంది. స్టేషన్ నుంచి బయటకు రావడానికి, లోపలకు వెళ్లడానికి అవస్థలు ఎదుర్కొంటున్నారు. వారాంతంలో, సెలవుల్లో అయితే మరిన్ని కష్టాలు తప్పువు. ఈ సమస్యలను ప్రత్యక్షంగా చూసిన కేంద్ర పెద్దలు స్పందించి చర్యలు చేపట్టారు. వచ్చే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రైల్వేస్టేషన్ రూపురేఖలు మార్చాలని సంకల్పించారు. ఆ దిశగా నిర్మాణ పనులు మొదలుపెట్టారు
-తిరుపతి అర్బన్, ఆంధ్రజ్యోతి
అదనంగా ఐదు ప్లాట్‌ఫామ్స్..
ప్రస్తుతం ఆరు ప్లాట్‌ఫామ్స్, ఐదు ఫిట్‌లైన్లు (మరమ్మతులు, చెక్కింగ్, స్టీరింగ్ ట్రాక్స్) ఉన్నాయి. రోజూ 182 రైళ్లు రాకపోకలు సాగిస్తుండటంతో ప్లాట్‌ఫామ్స్ కొరత కారణంగా ఊరు బయటనే పలురైళ్లు కాసేపు ఆగాల్సి వస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి ఇప్పుడు ఫిట్‌లైన్లను తిరుచానూరు రైల్వేస్టేషన్‌కు తరలించే ప్రతిపాదన ఉంది. తర్వాత ఫిట్‌లైన్ల స్థానంలో మరో ఐదు ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి రానున్నాయి. మొత్తం ప్లాట్‌ఫామ్స్ 11కు పెరుగుతాయి.
తిరుపతి రైల్వేస్టేషన్ ప్రపంచస్థాయి ఏర్పాట్లతో ఉత్తర, దక్షిణ దిశల్లో రెండు బారీ భవనాలు, స్టేషన్ ప్లాట్‌ఫామ్స్ ఆధునికీకరణ లిఫ్టులు, ఎస్కలేటర్లు వంటి అత్యాధునిక సౌకర్యాలు కల్పించడానికి రూ.321కోట్లు కేటాయించారు. ఈ క్రమంలో 2022 మే నెలలో ప్రారంభించిన పనులు కొలిక్కి వచ్చాయి. రైళ్ల రాకపోకలకు ప్రయాణికుల సంచారానికి ఎలాంటి ఆటంకం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూనే నిర్మాణాలు కొనసాగించారు. దక్షిణదిశ భవనం దాదాపు పూర్తి కావచ్చింది. ప్రస్తుతం తుదిమెరుగుల పనులు జరుగుతున్నాయి. కొరత వసులు కూడా రాత్రింబవళ్లు పూర్తిచేసి మార్చిలో అందుబాటులోకి తేవాలని రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పుడిప్పుడే పనుల్లో వేగం పుంజుకున్న ఉత్తర దిశ భవనం డిసెంబరులో అందుబాటులోకి రానుందని రైల్వేఅధికార యంత్రాంగం ద్వారా తెలుస్తోంది.
ప్రపంచస్థాయి సౌకర్యాలు..
నూతనంగా అందుబాటులోకి రానున్న తిరుపతి రైల్వేస్టేషన్ పూర్తిగా సీసీ టీవీ సెక్యూరిటీ పరిధిలో ఉంటుంది. స్టేషన్ విస్తీర్ణం ధీటుగా ఆర్వీఎఫ్ బలగాల పెంపు, స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాలు, 20 కేవీ విద్యుత్ ఉత్పత్తికి రెండు భవనాలపై సోలార్ వ్యవస్థ ఏర్పాటు, అన్ని ప్లాట్‌ఫామ్స్‌కు కలిపి మొత్తం 26 లిఫ్టులు, 24 ఎస్కలేటర్లు వర్షపు నీరు నేరుగా భూమిలోకి ప్రవేశించేలా ప్రత్యేక ఏర్పాట్లు కలవు.
రెండు ఎయిర్ కాన్ కోర్సులు..
దేశంలోనే భోపాల్ తర్వాత తిరుపతి రైల్వేస్టేషన్‌లోనే ప్రయాణం కాలక్షేపం కోసం రెండు ఎయిర్ కాన్ కోర్సులు ఏర్పాటు చేస్తున్నారు. రైళ్ల కోసం నిరీక్షించే ప్రయాణికుల సౌకర్యార్థం ట్రాక్స్‌కు ఇరువైపులా ఉన్న ఉత్తర, దక్షిణ భవనాల వరకు 61 మీటర్ల పొడవు, 12 వెడల్పుతో దీనిని నిర్మించారు. ఇందులో రూఫ్‌ప్లాజ్, మరుగుదొడ్లు, కుర్చీలు, విశ్రాంతి బల్లాలు వంటి సకల సదుపాయాలు కల్పించారు. వీటికి లిఫ్టులు, ఎస్కలేటర్లను అనుసంధానించారు. రైళ్లు వచ్చిన సమయానికి ప్రయాణికులు అక్కడి మంచి ప్లాట్‌ఫామ్స్‌కు చేరుకోవచ్చు.
మల్టీలెవల్ కార్ పార్కింగ్..
నూతన రైల్వేస్టేషన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రస్తుతమున్న రైల్వేటిక్కెట్ బుకింగ్, కార్యాలయాల భవనాన్ని కూల్చి వేయనున్నారు. దానిస్థానంలో మల్టీలెవల్ కార్ పార్కింగ్ సౌకర్యాలు కల్పించనున్నారు. ఐదు అంతస్తుల్లో రెండు కార్ పార్కింగ్, రెండు వెయిటింగ్ హాల్స్ చివరి అంతస్తులో కార్యాలయాలు, విశ్రాంతి గదులు, క్లాక్‌రూమ్స్, లాకర్స్, రన్నింగ్ రూమ్స్, ఉద్యోగుల రెస్ట్‌రూమ్స్, మెడిటేషన్, డైనింగ్, సెమినార్ హాల్స్ ఏర్పాటు చేయనున్నారు.
ఉత్తర భవనం..
రైల్వేస్టేషన్‌కు ఉత్తరభాగంలో 10,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం ప్రారంభమైంది. భూభాగం నుంచి మూడు అంతస్తుల భవనం, ఇందులో 79 బ్లాక్ టాయిలెట్స్, 12 రిటైరింగ్ రూమ్స్ (అద్దెగదులు), కార్యాలయాలు, రైల్వే అధికారులకు విశ్రాంతి గదులు, టిక్కెట్ బుకింగ్ కౌంటర్లు, దాదాపు 30 వేలమందికి సరిపడా వెయిటింగ్ హాల్స్, డిజిటల్ లాకర్స్, ఫుడ్ కోర్ట్, రైల్వేహెల్త్ యూనిట్, 200కిలోలీటర్ల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, డ్రాపింగ్, పికప్‌లకు ప్రత్యేక మార్గాలు, వంటి సదుపాయాలు ఉంటాయి.
దక్షిణ భవనం..
రైల్వేస్టేషన్‌కు దక్షిణభాగం 14,821 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన్ నిర్మాణం జరిగింది. భూభాగం నుంచి మూడు అంతస్తులున్నాయి. గ్రానైట్ ఫ్లోరింగ్, టిక్కెట్ బుకింగ్ కౌంటర్లు, దాదాపు 50 వేలమందికి సౌకర్యంగా వెయిటింగ్ హాల్స్, అనునంధానంగా కామన్ టాయిలెట్లు ప్రత్యేకంగా లేడీస్ వాష్‌రూమ్స్, రైల్వే విభాగాల కార్యాలయాలు, మూడు వీఐపీ లాంజ్‌లు, దుకాణాలు, రెస్టారెంట్లు, క్లాక్‌రూమ్స్, డిజిటల్ లాకర్స్, హెల్త్‌యానిట్, డ్రాపింగ్, పికప్‌లకు ప్రత్యేక మార్గాలు, 900కిలోలీటర్ల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, బేస్మెంట్‌లో 200కార్లు 300 ద్విచక్రవాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ సదుపాయం. స్టేషన్ నుంచి కుడి, ఎడమ వైపులున్న డీఆర్ మహల్, రాయల చెరుపు రోడ్డులను అనుసంధానించే 40 అడుగుల రోడ్డు నిర్మాణం. ఈ భవనంపై 10 అంతస్తులతో హోటల్ అండ్ రెస్టారెంట్ నిర్మించే ప్రతిపాదనకు తాజాగా ఆమోదముద్ర పడింది. రైల్వేస్టేషన్‌కు అభిముఖంగా నిర్మిస్తున్న శ్రీపాదం, అమృతం భారీ భవనాల నుంచి టీటీడీ స్కైవాక్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
వినూత్న బోధనలో ఆ టీచర్ ఆదర్శంగా నిలిచారు: మంత్రి నారా లోకేశ్
హ్యాపీ బర్త్ డే నితీశ్ జీ.. ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలి: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And Telugu News