శ్రీకాళహస్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. నలుగురి అరెస్ట్
ABN , Publish Date - Aug 11 , 2026 | 03:51 PM
శ్రీకాళహస్తిలో సంచలనంగా మారిన హత్య కేసును తిరుపతి జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి అంతర్రాష్ట్ర నేరచరిత్ర కలిగిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
తిరుపతి, ఆగస్టు 11: శ్రీకాళహస్తిలో సంచలనంగా మారిన హత్య కేసును తిరుపతి జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి అంతర్రాష్ట్ర నేరచరిత్ర కలిగిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఆగస్టు 2న రాత్రి 7:30 గంటల సమయంలో శ్రీకాళహస్తి పీఆర్ గేట్ ప్రాంతంలో స్వర్ణముఖి నది కట్టపై శివ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. టెక్నికల్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి.. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడుకు చెందిన ముగ్గురు, పుత్తూరుకు చెందిన ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై తమిళనాడు రాష్ట్రంలో గతంలో పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. చెన్నైకి చెందిన థొప్పై గణేశన్ గ్యాంగ్(Thoppai Ganesan Gang)తో నిందితులకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. హత్యకు ఉపయోగించిన బైక్, రెండు కత్తులు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. కేసును ఛేదించడంలో కీలకంగా పనిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ సుబ్బరాయుడు అభినందించారు.
ఇవి కూడా చదవండి...
మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై కేసు నమోదు
ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక సూచనలు
Read Latest AP News And Telugu News