పేద పిల్లల కలలకు చిరునామాగా.. యంగ్ ఇండియా స్కూల్స్: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Aug 11 , 2026 | 02:53 PM
తెలంగాణ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థికీ ప్రపంచ స్థాయి విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ప్రతి విద్యార్థికీ ప్రపంచ స్థాయి విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక వసతులతో ఈ విద్యాలయాలు నిర్మితమవుతున్నాయని సీఎం వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్..
‘భవనాలు నిర్మించడం సులభమే.. కానీ కలలకు పునాదులు వేయాలంటే ప్రభుత్వానికి సంకల్పం ఉండాలి. ఆ సంకల్పంతోనే తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఆర్థిక, సామాజిక అసమానతలకు ముగింపు పలుకుతూ.. కులం, మతం, ప్రాంతం, కుటుంబ నేపథ్యం అనే గీతలను చెరిపేస్తూ.. ప్రతి చిన్నారికీ ప్రపంచ స్థాయి విద్యను అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక వసతులతో నిర్మితమవుతున్న ఈ విద్యాలయాలు.. పేద కుటుంబాల పిల్లలను రేపటి శాస్త్రవేత్తలుగా, పరిపాలకులుగా, పారిశ్రామికవేత్తలుగా, నవభారత నిర్మాతలుగా తీర్చిదిద్దే జ్ఞాన మందిరాలుగా నిలవబోతున్నాయి. పేద పిల్లల కలలకు చిరునామాగా... తెలంగాణ మోడల్‌కు ప్రతీకగా... యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తరతరాల భవిష్యత్తును మార్చబోతున్నాయి’ అంటూ ఎక్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
గుడిమల్కాపూర్‌లో బాలుడిపై తండ్రి దాడి ఘటన.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి
తెలంగాణలో SIR ఎన్యూమరేషన్ పూర్తి... ఓటర్ల జాబితాలో కీలక మార్పులు
Read Latest Telangana News And Telugu News