ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక సూచనలు
ABN , Publish Date - Aug 11 , 2026 | 11:51 AM
ఏపీ స్థూల దేశీయోత్పత్తి(GSDP), నెలవారీ ఆర్థిక నివేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత నెలకు సంబంధించిన ఆర్థిక నివేదికను ప్రణాళికా విభాగం అధికారులు ముఖ్యమంత్రికి అందజేశారు.
అమరావతి, ఆగస్టు 11: ఏపీ స్థూల దేశీయోత్పత్తి(GSDP), నెలవారీ ఆర్థిక నివేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత నెలకు సంబంధించిన ఆర్థిక నివేదికను ప్రణాళికా విభాగం అధికారులు ముఖ్యమంత్రికి అందజేశారు. ఎల్‌నినో సంక్షోభంలోనూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సానుకూల వృద్ధిని నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రాష్ట్రం 10.7 శాతం వృద్ధిరేటు నమోదు చేసినట్లు వెల్లడించారు.
వ్యవసాయ రంగంలో 13.5 శాతం, పారిశ్రామిక రంగంలో 10.6 శాతం, సేవల రంగంలో 9.9 శాతం వృద్ధి నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాధారణ ఎగుమతుల్లో రూ.16,322 కోట్లతో 10.5 శాతం మేర వృద్ధి రికార్డైనట్లు వెల్లడించారు. టెక్నాలజీ ఇంటిగ్రేషన్ కారణంగా 21 శాతం వృద్ధితో జీఎస్టీ పన్ను వసూళ్లు రూ.13,282 కోట్లకు చేరిందన్నారు. రూ.2.88 లక్షల కోట్ల భారీ, మెగా ప్రాజెక్టుల గ్రౌండింగ్, రూ.60 వేల కోట్ల ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులతో 73.6 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపారు. ఎల్‌నినో కారణంగా ఈ సీజన్‌కు రాష్ట్రవ్యాప్తంగా 51.8 శాతం మేర లోటు వర్షపాతం నమోదైందన్నారు. 2023-24లో రియల్ జీఎస్డీపీ 6.5 శాతంగా ఉంటే 2025-26 ఏడాదికి 9.9 శాతానికి పెరిగినట్లు తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని అధికారులు పేర్కొన్నారు.
ప్రతి ప్రభుత్వ శాఖ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా అందుబాటులో ఉన్న వనరుల నిర్వహణ చేపట్టాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. అలాగే, సామాన్య ప్రజలపై అదనపు ధరల భారం పడకుండా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ వృద్ధి లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. ఎల్‌నినో సంక్షోభం నేపథ్యంలో నీటి లభ్యత, ఉత్పత్తుల విలువ జోడింపుపై సూచనాత్మక కంటిజెన్సీ ప్రణాళిక చేయాలన్నారు. జిల్లా, నియోజకవర్గం, మండలాల వారీగా ప్రణాళికల విడుదల ద్వారా లక్ష్య సాధన సులువవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.
ఇవి కూడా చదవండి...
లోకేశ్ ఆదేశాలు.. థాయ్‌లాండ్‌లో విద్యార్థులతో మాట్లాడిన ఏపీ భవన్ అధికారులు
మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై కేసు నమోదు
Read Latest AP News And Telugu News