Jallikattu: రణరంగాన్ని తలపించిన జల్లికట్టు.. యువకులకు గాయాలు
ABN , Publish Date - Jan 02 , 2026 | 06:00 PM
తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం శానంభట్లలో న్యూఇయర్, సంక్రాంతి పండుగ సందర్భంగా సంప్రదాయ జల్లికట్టు (పశువుల పండుగ) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలో వేగంగా పరిగెత్తే కోడె గిత్తలను యువకులు నిలువరించడానికి ప్రయత్నించడంతో పల్లె వీధులు రణరంగంగా మారాయి.
తిరుపతి,జనవరి2 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం శానంభట్లలో న్యూఇయర్, సంక్రాంతి పండుగ సందర్భంగా సంప్రదాయ జల్లికట్టు (పశువుల పండుగ) (Jallikattu) వేడుకలు ఇవాళ(శుక్రవారం) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలో వేగంగా పరిగెత్తే కోడె గిత్తలను యువకులు నిలువరించడానికి ప్రయత్నించడంతో పల్లె వీధులు రణరంగంగా మారాయి.
ఈ జల్లికట్టు వేడుకల్లో పశువులను క్రమంగా నిలువరించే సమయంలో ఇద్దరు యువకులు తీవ్ర గాయాల పాలయ్యారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. జల్లికట్టులో గాయపడినవారిని 108 అంబులెన్స్ ద్వారా తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు.
గతంలో పల్లెలోని పశువులతో జల్లికట్టు జరిగేది. కానీ కొత్త సంప్రదాయం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల నుంచి సుమారు 200 కోడె గిత్తలను యువకులు ఊరులోని వీధుల్లో పరిగెత్తించారు. ఈ విధానం ప్రమాదకరంగా మారింది. అయితే, రెండు సంవత్సరాల క్రితం ఊరి పెద్దలు కలెక్టర్, పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు కనీస చర్యలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు.
జల్లికట్టు సమయంలో ఇరుకువీధుల్లో పదునైన కొమ్ములతో గిత్తలను పరిగెత్తించడంతో ఈ ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో గ్రామంలో 80 మంది పోలీసులు కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేశారు. ఈ వేడుకను దగ్గరుండి పోలీసులు పర్యవేక్షించారు.
ఈ సంప్రదాయంపై ప్రజల నుంచి విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు జల్లికట్టును సంక్రాంతి సంస్కృతి, పల్లె ఆనందంగా చూస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ ఆటను అత్యంత ప్రమాదకరమైనదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారులు, భద్రతా దళాలు ప్రతి ఏడాది ఈ వేడుకలను నిలువరించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆనాదిగా వస్తున్న ఆచారం కావడంతో జల్లికట్లు నిర్వహించే సమయంలో సరైన భద్రతా ప్రమాణాలూ, గాయాల నివారణా చర్యలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
భూ వివాదాల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం: సీఎం చంద్రబాబు
పెట్టుబడుల సాధనలో ఏపీ మరో రికార్డు
Read Latest AP News And Telugu News