తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్.. నలుగురు మృతి
ABN , Publish Date - May 04 , 2026 | 08:24 AM
తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాయుడుపేట - రేణిగుంట జాతీయ రహదారిపై శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద ఆగి ఉన్న లారీని అంబులెన్స్ వేగంగా వచ్చి ఢీకొట్టింది.
తిరుపతి జిల్లా, మే 4 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లాలో ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాయుడుపేట - రేణిగుంట జాతీయ రహదారిపై శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద ఆగి ఉన్న లారీని అంబులెన్స్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లారీని ఢీకొన్న అంబులెన్స్..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతా నుంచి ఒక రోగిని మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఓ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై అప్పటికే నిలిపి ఉంచిన లారీని అంబులెన్స్ వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న రోగితో పాటు ఆయనకు సహాయకులుగా ఉన్న మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారని ప్రాథమిక సమాచారం. వీరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
డ్రైవర్ పరిస్థితి విషమం..
అంబులెన్స్ డ్రైవర్ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
పోలీసుల చర్యలు..
సంఘటనా స్థలానికి చేరుకున్న శ్రీకాళహస్తి పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహానాడును.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తాం: మంత్రి ఆనం
విజయసాయికి అన్ని పార్టీల్లో డోర్లు క్లోజ్ అయ్యాయి.. బుద్దా వెంకన్న సెటైర్లు
ప్రకాశ్‌రాజ్ ఓ పొలిటికల్ జోకర్.. కిరణ్ రాయల్ షాకింగ్ కామెంట్స్
Read Latest AP News And Telangana News And International News And Telugu News