వ్యక్తి మారితే సమాజం మారుతుంది
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:20 PM
విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ‘విలువల విద్యా సదస్సు’ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది.
విలువల విద్యా సదస్సులో చాగంటి కోటేశ్వరరావు
తిరుపతి: విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ‘విలువల విద్యా సదస్సు’ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. ప్రవచన వాచస్పతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రసంగించిన ఈ సదస్సులో జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి దాదాపు 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాగంటి మాట్లాడుతూ గాంధీ సాదాసీదా జీవన విధానం, నిజాయితీ, క్రమశిక్షణ, పరిశుభ్రతపై ఆయన చూపిన కట్టుబాటును వివరించారు.
‘వ్యక్తి మారితే సమాజం మారుతుంది’ అనే గాంధీజీ ఆలోచనను ప్రతి విద్యార్థి తన జీవితంలో ఆచరణలో పెట్టాలని సూచించారు. పరిశుభ్రత ఆరోగ్యానికి తొలి మెట్టు అని పేర్కొంటూ, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పాఠశాల, ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతని చెప్పారు. రోజూ వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండడం అవసరమని వివరించారు. జపాన్, స్వీడన్ దేశాల్లో చెత్త నిర్వహణ, రీసైక్లింగ్ పద్ధతులను ఉదాహరణగా చెబుతూ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, ప్రకృతి మరియు పర్యావరణాన్ని రక్షించాలని విద్యార్థులకు సూచించారు.
సెల్‌ఫోన్ అధిక వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్ప్రభావాలను వివరించి, సమయాన్ని వృథా చేయకుండా పుస్తక పఠనం, క్రీడలు, యోగాభ్యాసం వంటి మంచి అలవాట్లను అలవరచుకోవాలని సూచించారు.నైతిక విలువలు లేని ఏ పనైనా విషంతో సమానమని స్పష్టం చేస్తూ, సత్యం, క్రమశిక్షణ, గౌరవం, సేవాభావం వంటి సద్గుణాలు ప్రతి విద్యార్థి జీవితానికి పునాది కావాలని తెలిపారు. పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు చాగంటి కోటేశ్వరరావు సమాధానాలిచ్చారు. కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని, దానికి బానిసలుగా మారకూడదని హెచ్చరించారు.
విలువలతో కూడిన విద్యే సమాజానికి ఆదర్శ పౌరులను అందిస్తుందని తెలిపారు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ పాఠ్యాంశాల బోధనతో పాటు విలువల విద్యను సమానంగా అందించడం అవసరమని తెలిపారు. విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ఇలాంటి సదస్సులు ఎంతో దోహదపడతాయన్నారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన ’గురు అష్టకం‘ నృత్య రూపకం ఆకట్టుకుంది. ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.ఎన్. కుమార్, సమగ్ర శిక్ష ఏపీసీ గౌరీ శంకర్, మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉష తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News