మావోయిస్టు అగ్రనేత గణపతి ఆచూకీ లభ్యం
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:05 PM
కొన్ని దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీని నడిపించిన ఆగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు ఆచూకీ లభ్యమైంది.
హైదరాబాద్, ఫిబ్రవరి 24: కొన్ని దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీని నడిపించిన ఆగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు ఆచూకీ లభ్యమైంది. గత కొన్నేళ్లుగా భారత్ పొరుగునున్న నేపాల్‌లో ఆయన మకాం వేశారు. తీవ్ర అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే గణపతిని భారత్‌కు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వృద్ధాప్యం కారణంగా మావోయిస్టు పార్టీ కార్యదర్శి పదవిని గణపతి వదిలిపెట్టిన సంగతి తెలిసిందే.
పోలీసుల ఎదుట దేవ్ జీ..
మరో వైపు హైదరాబాద్‌లో పోలీస్ ఉన్నతాధికారుల ఎదుట నలుగురు కీలక మావోయిస్టులు లొంగిపోనున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సెక్రటరీ దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు, కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డితోపాటు నున్నె నరసింహారెడ్డిలు లొంగిపోనున్నారు.
ఆసిఫాబాద్ అడవుల్లో..
ఇటీవల ఆసిఫాబాద్ అడవుల్లో ఎస్ఐబీ ఎదుట దేవ్ జీతోపాటు మల్లా రాజిరెడ్డి లొంగిపోయిన సంగతి తెలిసిందే. అదీకాక దేవ్ జీతోపాటు పలువురు అగ్రనేతలు మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలకు చేరుకున్నారంటూ నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కర్రెగుట్టల ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు మరణించిన విషయం విదితమే.
చరిత్రగా మావోయిస్టు పార్టీ..
2026, మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకొంది. ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. దీంతో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా బలగాలు నిరంతరం కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో వందలాది మంది మావోయిస్టులు మరణించారు. వేలాది మంది ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. పలువురు అరెస్టయ్యారు.
భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లలో పలువురు అగ్రనేతలు సైతం మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు పోలీసులకు చిక్కితే.. మావోయిస్టు పార్టీ చరిత్రగా మిగిలిపోయే అవకాశం ఉందనే ఒక చర్చ సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీకాకుళంలో ప్రబలిన డయేరియా.. సీఎం చంద్రబాబు సమీక్ష
కల్తీ పాలను ఇంట్లోనే గుర్తించండి.. ఇవిగో సింపుల్ చిట్కాలు..
For More TG News And Latest News