త్వరలోనే పశు వైద్యశాలల్లో వైద్యుల నియామకం: మంత్రి అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Feb 24 , 2026 | 10:35 AM
పశు వైద్యశాలల్లో సౌకర్యాల కొరత, వైద్యుల నియామకాలపై ఎమ్మెల్యే సాంబశివరావు అడిగిన ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం అన్ని శాఖల్లో నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు.
అమరావతి, ఫిబ్రవరి 24: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో(AP Assembly Session) ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పశు వైద్యశాలల్లో సౌకర్యాల కొరత, వైద్యుల నియామకాలపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) సమాధానం ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమైన శాఖలకు తాళాలు వేశారని.. అన్ని శాఖల్లో నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు. ఇబ్బందులను సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి వివరించారు.
పశు వైద్యశాలల్లో సౌకర్యాలు, ఉపకరణాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి ఉచితంగా మందుల సరఫరా చేస్తున్నామన్నారు. వెటర్నరీ ఆసుపత్రుల భవనాలు చాలా వరకు శిథిలావస్థకు చేరాయని చెప్పారు. 2014-19 మధ్య కాలంలో నాబార్డ్ నిధులతో 326 భవనాలు మంజూరు చేశామని.. వాటిలో కొన్ని భవనాల నిర్మాణాలను అప్పట్లో పూర్తి చేశామని గుర్తుచేశారు. అయితే.. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక కొత్త భవనాల నిర్మాణం నిలిపేసిందన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో భవనాల మరమ్మతులు చేపడుతున్నామని తెలిపారు. త్వరలోనే వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపడతామని మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రకటించారు.
ఇవి కూడా చదవండి...
పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం
ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు.. ‘అడవితల్లి బాట’పై మంత్రి సమాధానం
Read Latest AP News And Telugu News