ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు.. ‘అడవితల్లి బాట’పై మంత్రి సమాధానం
ABN , Publish Date - Feb 24 , 2026 | 10:00 AM
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ‘అడవితల్లి బాట’ కార్యక్రమంపై ఎమ్మెల్యే రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం ఇచ్చారు.
అమరావతి, ఫిబ్రవరి 24: ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Session) తొమ్మిదో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ 'అడవితల్లి బాట' కార్యక్రమంపై ప్రశ్న లేవనెత్తారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సభలో లేకపోవడంతో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం ఇచ్చారు. గిరిజన గ్రామాలు, కొండ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాల కోసం 'అడవితల్లి బాట' కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రూ.1,077 కోట్లతో ఈ కార్యక్రమం అమలవుతోందని.. దీని ద్వారా సుమారు 4 వేల కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం జరుగుతోందని మంత్రి వివరించారు.
మన్యం ప్రాంతంలో సరైన రోడ్లు లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడేవారని మంత్రి అన్నారు. అనారోగ్యానికి గురైనప్పుడు వైద్యం కోసం డోలీల ద్వారా రోగులను తరలించాల్సి వచ్చేదని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 'అడవితల్లి బాట' కార్యక్రమాన్ని చేపట్టారని నాదెండ్ల మనోహర్ వివరించారు. అలాగే ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రామాల సమస్యను కొణతాల రామకృష్ణ సభలో ప్రస్తావించారు. ఈ గ్రామాల ప్రజలు రెండు రాష్ట్రాల్లో ఓటుహక్కును కలిగి ఉన్నారన్నారు. అయితే.. ఏపీ అధికారులు అక్కడికి వెళ్లకుండా ఒడిశా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ సమస్యపై ప్రభుత్వం జోక్యం చేసుకుని త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు.
అంతకముందు సభలో.. ఇటీవల మరణించిన పలువురు మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం తెలియజేసింది. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్ రెడ్డి, విజయవాడ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ పాషా, రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే గంటె సుమన్, శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండు అప్పల సూర్యనారాయణ, తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి వరలక్ష్మి, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే రత్నాబాయి మృతి పట్ల సభ సంతాపం తెలిపింది. ప్రజా జీవితంలో వారు చేసిన సేవలను సభకు వివరించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. మాజీ శాసనసభ్యుల మృతికి గౌరవసూచకంగా సభ్యులందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
ఇవి కూడా చదవండి...
కల్తీ పాలను ఇంట్లోనే గుర్తించండి.. ఇవిగో సింపుల్ చిట్కాలు..
పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం
Read Latest AP News And Telugu News