Share News

సుబ్రహ్మణ్య స్వామికి ఎదురుదెబ్బ

ABN , Publish Date - Feb 24 , 2026 | 05:56 AM

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన సీబీఐ సిట్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా పాలనాపరమైన చర్యలు తీసుకునేందుకుగాను చంద్రబాబు ప్రభుత్వం నియమించిన...

సుబ్రహ్మణ్య స్వామికి ఎదురుదెబ్బ

  • ఏకసభ్య కమిటీపై పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీం

  • నేర విచారణ, బాధ్యుల నిర్ధారణ వేర్వేరు అంశాలు

  • సిట్‌ దర్యాప్తు, ప్రభుత్వ విచారణ మధ్య వైరుధ్యం లేదు

  • పాలనా లోపాలపై విచారణకు రాష్ట్రం ఆదేశించవచ్చు

  • సిట్‌, ఏకసభ్య కమిటీ రెండూ విచారణ జరపొచ్చు

  • పిటిషనర్‌ లేవనెత్తిన అభ్యంతరాలకు ఆధారం లేదు

  • కమిటీపై స్టే ఇచ్చేందుకు సీజేఐ బెంచ్‌ నిరాకరణ

  • ‘కల్తీ’ బాధ్యులను కాపాడేందుకే పిటిషన్‌!

  • దురుద్దేశంతోనే వేశారు.. కల్తీ నెయ్యి వ్యవహారంలో గతంలోనూ పిల్‌

  • బాధ్యులను కాపాడేందుకే పాలనా చర్యలను నీరుగార్చాలని చూస్తున్నారు.. లూథ్రా వాదన

సిట్‌ బృందం విచారణ పూర్తిచేసి చార్జిషీట్‌తోపాటు సప్లిమెంటరీ చార్జిషీటు కూడా దాఖలు చేసింది. క్రిమినల్‌ విచారణ దాని పరిధిలోని అంశం. అయితే, పరిపాలనాపరమైన లోపాలు, నిర్లక్ష్యం లేదా క్రిమినల్‌ నిర్లక్ష్యానికి కూడా అవకాశం ఉండొచ్చు కదా? దానిని మనం ఎలా తోసిపుచ్చగలం? అయితే, ఇవన్నీ ప్రభుత్వ యంత్రాంగం పరిధిలోకి వచ్చే అంశాలు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించింది. పరిపాలనా పరమైన లోపాలు ఎక్కడ జరిగాయి? బాధ్యులు ఎవరు? పర్యవసానాలు ఏమిటి? వంటి అనేక అంశాలను తేల్చడానికే కమిటీని నియమించినట్లు కనిపిస్తోంది. అందువల్ల పిటిషనర్‌ లేవనెత్తిన అభ్యంతరాలకు ఆధారం కనిపించడం లేదు.

- సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): తిరుమల కల్తీ నెయ్యి కేసులో సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన సీబీఐ సిట్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా పాలనాపరమైన చర్యలు తీసుకునేందుకుగాను చంద్రబాబు ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీకి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఏకసభ్య కమిటీ విచారణపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. దీనిపై బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. సిట్‌ దర్యాప్తు, ప్రభుత్వ విచారణల మధ్య వైరుధ్యం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.


సిట్‌ దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం చేపట్టిన పరిపాలనా పరమైన విచారణపై ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో పాలనాపరమైన చర్యలు తీసుకోవాలన్న సిట్‌ ప్రతిపాదన మేరకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి దినేశ్‌ కుమార్‌ నేతృత్వంలో చంద్రబాబు ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఆ వ్యవహారం జరిగినప్పుడు టీటీడీలో, పాలకమండలిలో పనిచేసినవారిపై కమిటీ విచారణ జరపనుంది. అయితే, కమిటీ విచారణను నిలిపివేయాలని కోరుతూ బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో ఈ నెల 11న పిటిషన్‌ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్‌ ఉండగా, మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించడాన్ని ఆయన తన పిటిషన్‌లో సవాల్‌ చేశారు. కమిటీ ఏర్పాటు సుప్రీంకోర్టు గత ఆదేశాలను ఉల్లంఘించడమేనని వాదించారు. దీనివల్ల సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న సిట్‌ విచారణపై ప్రభావం పడే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి పదే పదే భక్తులను తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదుచేశారు. ఏకసభ్య కమిటీ నియామకాన్ని రద్దు చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు సీఎం, సిట్‌, సీబీఐ, టీటీడీలను ప్రతివాదులుగా చేర్చారు. ఆ పిటిషన్‌ సోమవారం చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌ మాల్యబాగ్చీలతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.


సిట్‌ దర్యాప్తుపై ప్రభావం: సుబ్రహ్మణ్య స్వామి

సుబ్రహ్మణ్య స్వామి తరఫున సీనియర్‌ న్యాయవాది రాజశేఖర్‌ రావు వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీ ప్రభావం సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని సిట్‌ దర్యాప్తుపై పడే అవకాశం ఉందని వాదించారు. అయితే, పిటిషనర్‌ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఇది ఉద్దేశపూర్వకంగా దాఖలు చేసిన పిటిషన్‌లా ఉంది అని సీజేఐ వ్యాఖ్యానించారు.


పాలనాపరమైన దర్యాప్తు చేసుకోవచ్చు: సొలిసిటర్‌ జనరల్‌

తిరుమల కల్తీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన దర్యాప్తు చేసుకోవచ్చని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ‘‘సీబీఐ మాన్యువల్‌ నిబంధనల ప్రకారం.. విచారణ సమయంలో నేరపూరిత అంశాలతో సంబంధం లేని ‘పరిపాలనాపరమైన లోపాలు’ ఏవైనా బయటపడితే, వాటిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. సిట్‌ కొన్ని పరిపాలనాపరమైన లోపాలను గుర్తించింది. వాటిపై తదుపరి సమీక్ష కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సిట్‌ కేవలం నేరపూరిత కోణంలో దర్యాప్తు చేసింది. ప్రభుత్వం నియమించిన కమిటీ పరిపాలనాపరమైన అంశాలను మాత్రమే పరిశీలిస్తుంది. సిట్‌ విచారణ సమయంలోనూ పరిపాలనాపరమైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీతో దర్యాప్తు చేయించుకోవచ్చు. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు’’ అని చెప్పారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా, ముఖ్యమంత్రి తరఫున మరో సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహిత్గీ వాదనలు వినిపించారు. ‘‘దురుద్దేశంతో పిటిషన్‌ దాఖలు చేశారు. బాధ్యులను తప్పించి, అధికారులపై చర్యలను అడ్డుకునేందుకే పాలనాపర దర్యాప్తును నీరుగార్చాలనుకుంటున్నారు. తిరుమల అంశానికి సంబంధించి ఉద్దేశ పూర్వకంగా...కొన్ని పత్రికా కథనాల ఆధారంగా రిట్‌ పిటిషన్‌ వేశారు’’ అని లూథ్రా వాదించారు. ప్రస్తుత వ్యవహారమంతా పాలనాపరమైన విచారణకు మాత్రమే పరిమితమని రోహిత్గీ అన్నారు.


రెండు ప్రక్రియలనూ కొనసాగించండి: ధర్మాసనం

సిట్‌ దర్యాప్తు ఇప్పటికే పూర్తయిన విషయాన్ని ధర్మాసనం గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పరిపాలనా విచారణ వల్ల ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ఽఅభిప్రాయపడింది. ‘‘క్రిమినల్‌ విచారణ సిట్‌ పరిధిలోని అంశం. అయితే, పరిపాలనాపరమైన లోపాలు, నిర్లక్ష్యం లేదా క్రిమినల్‌ నిర్లక్ష్యానికి అవకాశం ఉండొచ్చు కదా? ఇవన్నీ ప్రభుత్వ యంత్రాంగం పరిధిలోకి వచ్చే అంశాలు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించింది.పిటిషనర్‌ లేవనెత్తిన అభ్యంతరాలకు ఆధారం కనిపించడం లేదు’’ అని బెంచ్‌ తెలిపింది. సిట్‌ దర్యాప్తు, ఏకసభ్య కమిటీ విచారణ రెండింటినీ చట్టానికి లోబడి కొనసాగించాలని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను ముగించింది.

Updated Date - Feb 24 , 2026 | 06:20 AM