బెంబేలెత్తిస్తున్న శునకాలు
ABN , Publish Date - Feb 24 , 2026 | 11:08 AM
హిందూపురం పట్టణంతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో వీధికుక్కల బెడద అధికమైంది. రోడ్లపై గుంపులుగా తిరుగుతూ దాడులకు తెగ బడుతున్నాయి.
హిందూపురం పట్టణంతో పాటు గ్రామాల్లో అధికమవుతున్న బెడద
రోడ్లపై గుంపులుగా దాడులకు తెగబడుతున్న వైనం
వానరాలు కూడా..
నియంత్రించాలంటూ జనం డిమాండ్
హిందూపురం(అనంతపురం): హిందూపురం పట్టణంతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో వీధికుక్కల బెడద అధికమైంది. రోడ్లపై గుంపులుగా తిరుగుతూ దాడులకు తెగ బడుతున్నాయి. వీధుల్లో ఎవరైనా ఒంటరిగా వీధుల్లో వెళ్లాలంటే జంకాల్సివస్తోంది. వాహనాల్లో వెళ్లే వారిని వెంబడించి మరీ గాయపరుస్తున్నాయి. ద్విచక్రవాహనాల్లో వెళ్లేవారు వాటి నుంచి తప్పించుకునే క్రమంలో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల పశువులపై కూడా అవి దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఇవి చాలదన్నట్లు ఇప్పుడు వానరాలు కూడా దాడులకు దిగుతున్నాయి. వాటి బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నా.. సంబంధిత అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.
కొద్దికాలంగా వాటి దాడులను పరిశీలిస్తే..
నెల క్రితం మండలంలోని మీనకుంటపల్లిలో కుక్కలు గుంపులుగా చేరి ఐదునెలల ఆవుదూడను కరిచి చంపేశాయి. తర్వాత అదే గ్రామంలో వారం వ్యవధిలోనే చిన్న పిల్లలను వెంటపడి కరిచాయి. నెల క్రితం పట్టణంలోని శ్రీకంఠపురంలో దంపతులు ద్విచక్రవాహనంలో వెళుతుండగా వెంట పడి కరవడానికి ప్రయత్నించాయి. వారు తప్పించుకునే ప్రయత్నంలో కింద పడి గాయాలపాలయ్యారు. తాజాగా గత ఆదివారం రాత్రి మండలంలోని జూమాకులపల్లిలో ఎనిమిది గొర్రె పిల్లలపై కుక్కల గుంపు దాడిచేసి చంపేశాయి.
ఇదిలా ఉండగా.. నెలక్రితం పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో కోతులు గుంపు ఇంట్లో జొరబడ్డాయి. మహిళ కర్రతో వాటిని తోలగా ఆమెపై దాడిచేశాయి. మూడు రోజులక్రితం త్యాగరాజనగర్‌లో ఓ ఇంటిలో ఉయ్యాలలో ఉన్న చిన్నారిపై కోతి దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. రెండు నెలలక్రితం చిలమత్తూరు మండలంలోని పల్లెలో కుక్కకాటుతో యువకుడు మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది.
వాటి నియంత్రణకు జనం డిమాండ్
హిందూపురం ప్రాంతంలో కుక్కలు, కోతుల దాడులు అధికమయ్యాయని, వాటి నియంత్రణకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పల్లె, పట్టణ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వాటి నుంచి జనానికి ఇబ్బందిలేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. హిందూపురం పట్టణంలోని 3వేలకుపైగా వీధి కుక్కలున్నట్లు తెలుస్తోంది. అయితే కోతులెన్ని ఉన్నాయో అధికారులు అంచనా వేయలేదు. ఇందులో చాలావాటికి రేబిస్ ఇంజక్షన్ కూడా వేయలేదు. దీంతో అవి కరిస్తే ప్రాణాలకు ముప్పు వచ్చే అవకాశం మెండుగా ఉంది.
కుక్కలు, కోతుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం..
హిందూపురం పట్టణంలో కుక్కలు, కోతుల నియంత్రణకు చర్యలు చేపట్టాం. ప్రతివారం 30 వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తున్నాం, రేబిస్ టీకాలు వేయిస్తున్నాం. అలాగే కోతులను పట్టుకుని అటవీప్రాంతంలో వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రెండు మూడురోజుల్లో కోతులుపట్టేవారు హిందూపురానికి వస్తున్నారు.
-మల్లికార్జున, మున్సిపల్ కమిషనర్, హిందూపురం
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News