కోఠి ఎస్‌బీఐ ఏటీఎం వద్ద కాల్పుల ఘటనలో నిందితుల అరెస్ట్.. కాసేపట్లో మీడియా ముందుకు!
ABN , Publish Date - Feb 24 , 2026 | 09:54 AM
హైదరాబాద్‌లోని కోఠి ఎస్‌బీఐ ఏటీఎం వద్ద గత నెలలో జరిగిన కాల్పుల కేసును టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఈ కాల్పులకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 24: నగరంలోని కోఠి ఎస్‌బీఐ ఏటీఎం వద్ద గత నెలలో కాల్పులు జరిగిన కేసును టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఈ కాల్పులకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా వారిని పోలీసులు విచారిస్తున్నారు. జనవరి 31న కోఠి ఎస్‌బీఐలో నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రిన్షద్ అనే వ్యక్తి వచ్చాడు. అతడిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. అనంతరం అతడి వద్దనున్న రూ. 6 లక్షల నగదుతో పాటు బాధితుడి వాహనాన్నీ తీసుకుని పరారయ్యారు.
ఈ కాల్పుల్లో రిన్షద్ కాలికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటన స్థలానికి చేరుకుని రిన్షద్‌ను ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్‌బీఐ ఏటీఎం ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు. ఈ చోరీ అనంతరం నిందితులు కాచిగూడ డీమార్ట్ సమీపంలోని ప్రార్థనా మందిరంలోకి వెళ్లి.. దుస్తులు మార్చుకున్నట్లు గుర్తించారు.
ఆ తర్వాత వాహనాన్ని రైల్వే స్టేషన్ వద్ద వదిలేసి పరారయ్యారు నిందితులు. అక్కడి నుంచి వారు రైలెక్కి పారిపోయారా? లేక బస్సు కానీ ఇతర వాహనంలో కానీ వెళ్లారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలా నిందితుల్లో ఒకరిని ఫిబ్రవరి 16న హరియాణాలో అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందుకోసం ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలించి ఎట్టకేలకు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కల్తీ పాలను ఇంట్లోనే గుర్తించండి.. ఇవిగో సింపుల్ చిట్కాలు..
ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి
For More TG News And Latest News