ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాల దగ్గర హై టెన్షన్
ABN , Publish Date - Oct 22 , 2026 | 03:26 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాల దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని నామినేషన్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
చిత్తూరు జిల్లా, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల (AP Local Body Elections) నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాల దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని నామినేషన్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ నియోజకవర్గ పరిధిలోని పెద్ద తిప్ప సముద్రం, తంబళ్లపల్లి మండల నామినేషన్ కేంద్రాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంపీటీసీ నామినేషన్లు రెండోరోజు కూటమి, వైసీపీ శ్రేణులు భారీగా తరలిరావడంతో పరస్పరం రెండు వర్గాల మధ్య ఘర్షణలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాలను పోలీసులు నియంత్రించి కేంద్రాల నుంచి దూరంగా పంపించివేశారు.
మార్కాపురం జిల్లాలో..
మార్కాపురం జిల్లాలోని కనిగిరిలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఎంపీటీసీ నామినేషన్లను వేసేందుకు వైసీపీ నాయకులు భారీగా ర్యాలీగా వచ్చారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో వైసీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను వైసీపీ నాయకులు తొలగించారు. దీంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
ముమ్మరంగా నామినేషన్లు..
మరోవైపు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలకు ముమ్మరంగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా రెండో రోజున పెద్దఎత్తున నామినేషన్లను కూటమి, వైసీపీ సహా వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు దాఖలు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో జోరుగా స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. జెడ్పీటీసీ స్థానాలకు కూటమి అభ్యర్థుల కంటే ఎక్కువగా వైసీపీ నేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్ల సర్దుబాటుపై కూటమి, వైసీపీ నేతలు కసరత్తు పూర్తి చేశారు. క్లారిటీ వచ్చిన చోట్ల నామినేషన్లను కూటమి, వైసీపీ అభ్యర్థులు దాఖలు చేస్తున్నారు. 9829 ఎంపీటీసీ స్థానాలకు గానూ తొలి రోజున 5267 నామినేషన్లను వివిధ పార్టీల అభ్యర్థులు దాఖలు చేశారు.
659 జెడ్పీటీసీ స్థానాలకు గానూ... తొలి రోజున 409 నామినేషన్లు దాఖలయ్యాయి. వివిధ ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ 2719, జనసేన 294 నామినేషన్లు, బీజేపీ 74, వైసీపీ 1918 నామినేషన్లు దాఖలయ్యాయి. వివిధ జెడ్పీటీసీ స్థానాలకు టీడీపీ 128, జనసేన 21, బీజేపీ 24, వైసీపీ 192 నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజున వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది.
ఇవి కూడా చదవండి...
విశాఖలో రోడ్డు ప్రమాదం.. గాయపడిన విద్యార్థులకు హోంమంత్రి అనిత సాయం
నకిలీ వాట్సాప్ నిర్వాహకులకు పవన్ కల్యాణ్ కార్యాలయం హెచ్చరిక
Read Latest AP News And Telugu News