Share News

జగన్ హయాంలో నల్లచట్టం తెచ్చారు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jan 31 , 2026 | 04:33 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు కొందరు రాష్ట్రాన్ని పట్టి పీడించారని ధ్వజమెత్తారు..

జగన్ హయాంలో నల్లచట్టం తెచ్చారు: సీఎం చంద్రబాబు
AP CM Chandra babu Naidu

చిత్తూరు, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు కొందరు రాష్ట్రాన్ని పట్టి పీడించారని ధ్వజమెత్తారు. ‘అది మీ భూమి, మీ ఆస్తి.. దానిపై జగన్ ఫొటో ఎందుకు’ అని మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం శాంతిపురం మండలం తుమ్మిసి వద్ద జరిగిన ప్రజావేదికపై ప్రసంగించారు. ప్రజల ఆస్తుల మీద ఫొటోలు వేసుకున్నారని మండిపడ్డారు.


రాళ్లపై బొమ్మలు వేసుకున్నారు..

దుర్మార్గం చేసింది చాలక తన పాలనే బెటర్ అంటూ ఇప్పుడు జగన్ మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలాక్సీ గ్రానైట్‌తో సర్వే రాళ్లు వేశారని, దానిపై బొమ్మలు వేసుకున్నారని విమర్శించారు. రాళ్లపై బొమ్మల కోసం రూ. 700 కోట్లు ఖర్చుపెట్టారని ఫైర్ అయ్యారు. ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్ పేరుతో నల్లచట్టం తెచ్చారని మండిపడ్డారు. భూ వివాదాలు వస్తే స్థానిక కోర్టులకు వెళ్లే అవకాశం లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. ఇంత ఘోరమైన చట్టం చేసి తనదే చాలా గొప్ప చట్టం అంటూ బుకాయిస్తున్నారని దుయ్యబట్టారు. గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నల్ల చట్టాన్ని.. తాము అధికారంలోకి రాగానే రద్దు చేశామని.. గత ప్రభుత్వంలో జరిగిన సర్వే తప్పిదాలను సరి చేస్తున్నామని తెలిపారు. ట్యాంపర్ చేయలేని విధంగా ఆధునిక టెక్నాలజీ వినియోగించి, పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


పెన్షన్ల ద్వారా సంక్షేమం అందిస్తున్నాం..

దేశంలోని ఏ రాష్ట్రమూ ఇవ్వనంత స్థాయిలో పెన్షన్ల ద్వారా సంక్షేమం అందిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ప్రతి నెలా రూ. 2,730 కోట్ల మేర పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. పెన్షన్ల కోసం తమిళనాడులో రూ. 315 కోట్లు, కర్ణాటకలో రూ. 392 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఏపీలో పేదలకు ఏ స్థాయిలో పెన్షన్ అంద చేస్తున్నామో ప్రజలు ఆలోచించాలి. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయి. ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం ఇచ్చాం. దీపం-2.0 పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. అన్ని రంగాల్లోనూ మహిళల భాగస్వామ్యం పెరగాలి. ఆడబిడ్డలకు సరైన ప్రాధాన్యం ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే. ఆస్తిలో మహిళలకు ఎన్టీఆర్ సమాన హక్కు కల్పించారు. నేను 33 శాతం రిజర్వేషన్‌ను ఉద్యోగాలు, విద్యా రంగంలో అమలు చేశా’ అని సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.


మహిళలకు రిజర్వేషన్లు..

33 శాతం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు రాబోతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘భవిష్యత్తులో మహిళలు పెద్ద ఎత్తున ఎంపీలు, ఎమ్మెల్యేలుగా అవుతారు. కుప్పం జలకళను సంతరించుకుంది. హంద్రీ - నీవాతో కాలువ ద్వారా కుప్పంలో అన్ని చెరువులూ కృష్ణా జలాలతో నిండాయి. హంద్రీ - నీవాతో అనంతపురానికి నీళ్లిచ్చాం. 10 లక్షల చెక్ డ్యాంలు నిర్మించాం. హంద్రీ - నీవా, గాలేరు - నగరితో సహా రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. దేశంలో రాయలసీమ హర్టికల్చర్ హబ్‌గా మారింది. ప్రస్తుతం 20 లక్షల ఎకరాల్లో హర్టికల్చర్ సాగు ఉంది. దీన్ని రెట్టింపు చేసి 500 లక్షల మెట్రిక్ టన్నుల సాగు సాధిస్తాం. కూటమి ప్రభుత్వానికి వారసత్వ సమస్యలు ఉన్నాయి’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ అవినీతి మూలాల్లోంచి వైసీపీ పుట్టింది: మంత్రి గొట్టిపాటి రవికుమార్

కల్తీ నెయ్యితో దాదాపు రూ.250 కోట్లు అక్రమాలు: ఎమ్మెల్యే దగ్గుపాటి

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Jan 31 , 2026 | 05:43 PM