Share News

గ్రూప్-1 పరీక్షల వివాదంపై హైకోర్టులో విచారణ

ABN , Publish Date - Sep 21 , 2026 | 08:32 PM

ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల వివాదంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. సిట్‌ సమర్పించిన నివేదికలతో జత చేసిన డాక్యుమెంట్ల కాపీలను అప్పీల్‌దారులకు అందించాలని హైకోర్టు ఆదేశించింది.

గ్రూప్-1 పరీక్షల వివాదంపై హైకోర్టులో విచారణ
APPSC Group 1,

అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల వివాదంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. సిట్‌ సమర్పించిన నివేదికలతో జత చేసిన డాక్యుమెంట్ల కాపీలను అప్పీల్‌దారులకు అందించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రిజిస్ట్రార్ జ్యూడీషియల్‌కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.


గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పరీక్షకు సంబంధించిన వాస్తవాలను తేల్చేందుకు హైకోర్టు సీఐడీ డీజీ నేతృత్వంలోని సిట్‌తో విచారణ జరిపించింది. విచారణ పూర్తి చేసిన సిట్.. ప్రాథమిక, తుది నివేదికలను హైకోర్టుకు సమర్పించింది. అయితే ఈ నివేదికలతో జత చేసిన కీలక డాక్యుమెంట్లు తమకు అందించాలని కోరుతూ పలువురు అప్పీల్‌దారులు హైకోర్టులో అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిగింది.


ఈ సందర్భంగా ఎంపికైన అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాది సీవీ రెడ్డి వాదనలు వినిపించారు. సిట్ సమర్పించిన ప్రాథమిక, తుది నివేదికల్లో వ్యత్యాసాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిట్ ఒక నిర్ధారణకు రావడానికి ఆధారమైన డాక్యుమెంట్లను తమకు అందించాలని కోరారు. అదే విధంగా న్యాయవాది మోహన్ రెడ్డి కూడా సిట్ అంచనాకు రావడానికి కారణమైన డాక్యుమెంట్ల కాపీలను ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. వాదనలు విన్న హైకోర్టు.. సిట్ నివేదికలతో జత చేసిన డాక్యుమెంట్ల కాపీలను అప్పీల్‌దారులకు వెంటనే అందజేయాలని రిజిస్ట్రార్ జ్యూడీషియల్‌ను ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ విద్యావ్యవస్థను నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేశ్

వైసీపీ నేతల తీరు మార్చుకోకపోతే ప్రజల ఛీత్కారానికి గురికాక తప్పదు: మంత్రి నారాయణ

శుభ్రమైన వీధి చీపురుతో మొదలవ్వదు: పవన్ కల్యాణ్

Updated Date - Sep 21 , 2026 | 08:32 PM