భారత్-జపాన్ స్పెషల్ టీ20కి టైఫూన్ ముప్పు.. మ్యాచ్ జరుగుతుందా?
ABN , Publish Date - Sep 21 , 2026 | 06:30 PM
మంగళవారం భారత్, జపాన్ జట్లు తొలిసారి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. అయితే జపాన్‌లో టైఫూన్ ప్రభావంతో భారీ వర్షాలు, తుపాను పరిస్థితులు నెలకొనడంతో ఈ మ్యాచ్‌పై వాతావరణ ప్రభావం ఉంటుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ జట్టు చారిత్రక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. మంగళవారం భారత్, జపాన్ పురుషుల జట్లు తొలిసారి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. 75 ఏళ్ల దౌత్య అనుబంధానికి గుర్తుగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జపాన్‌లో టైఫూన్ ప్రభావంతో భారీ వర్షాలు, తుపాను పరిస్థితులు నెలకొనడంతో ఈ మ్యాచ్‌పై వాతావరణ ప్రభావం ఉంటుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
భారత్-జపాన్ స్పెషల్ టీ20 మ్యాచ్ సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ స్టేడియం కాంటో ప్రాంతంలోని టోచిగి ప్రిఫెక్చర్‌లో ఉంది. తుపాను ప్రభావం ఈ ప్రాంతంపైనా ఉండే అవకాశం ఉండటంతో మ్యాచ్ నిర్వహణపై సందేహాలు తలెత్తాయి. జపాన్ వాతావరణ సంస్థ (JMA) ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొండచరియలు విరిగిపడటం, బలమైన గాలులు, వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే ప్రస్తుతం వాతావరణ అంచనాల ప్రకారం.. మంగళవారం మ్యాచ్‌కు దీర్ఘకాలికంగా భారీ వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.
సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ.. మంగళవారం ఉదయం వాతావరణ పరిస్థితులు మెరుగుపడే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఎండ కూడా కనిపించే అవకాశం ఉంది. అయితే మధ్యాహ్నం సమయంలో చిరుజల్లులు పడే అవకాశాలు ఉండటంతో.. మ్యాచ్‌కు స్వల్ప అంతరాయం కలగొచ్చు. అయితే మ్యాచ్ పూర్తిగా రద్దయ్యేంత స్థాయిలో సుదీర్ఘమైన భారీ వర్షం సూచనలు కనిపించడం లేదని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
ఆసియా గేమ్స్: కుమారుడి టీమ్ ఓటమి.. మాధవన్ రియాక్షన్ ఇదే!
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. రిజర్వ్ ఓపెనర్ రేసులో సాయి సుదర్శన్