రైతుల్ని ఆదుకుంటాం..
ABN , Publish Date - Jul 29 , 2026 | 06:42 AM
‘‘ఎల్‌నినో ఉపద్రవాన్ని అధికార యంత్రాంగం ఓ సవాల్‌గా తీసుకుని పని చేయాలి. ఈ కష్టకాలంలో రైతులను ఆదుకోవాలి. అన్నదాతలకు సరైన సమాచారాన్ని, సహకారాన్ని అందిస్తూ అండగా నిలవాలి. తీవ్ర ప్రభావిత మండలాల్లో బోర్లు ఆధారంగా పంటలను కాపాడుకునే అంశాన్ని పరిశీలించాలి.’’ అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
పంటల్ని కాపాడుకుందాం
ఎల్‌నినో ఉపద్రవాన్ని సవాల్‌గా తీసుకోవాలి
ఈ కష్టకాలంలో మంత్రులు, అధికారులు
క్షేత్రస్థాయిలో పర్యటించి భరోసా నింపాలి
కంట్రోల్ రూమ్‌తో నిరంతర పర్యవేక్షణ
ఉత్పాతాన్ని ఎదుర్కొనేలా కార్యాచరణ ప్రణాళిక
ఆగస్టు 3 నుంచి అవగాహన కార్యక్రమాలు
ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు సూచనలు
ప్రతి పంటకూ బీమా నమోదు కావాలి
ఏడాదికి సరిపోయేలా పశుగ్రాసం ఉండాలి
వీబీజీ రామ్‌జీ పథకాన్ని వినియోగించుకోవాలి
ఎల్ నినో పరిస్థితులపై సీఎం చంద్రబాబు నిర్దేశం
అంచనాకు మించి ప్రభావం: అధికారుల వెల్లడి
అమరావతి: ‘‘ఎల్‌నినో ఉపద్రవాన్ని అధికార యంత్రాంగం ఓ సవాల్‌గా తీసుకుని పని చేయాలి. ఈ కష్టకాలంలో రైతులను ఆదుకోవాలి. అన్నదాతలకు సరైన సమాచారాన్ని, సహకారాన్ని అందిస్తూ అండగా నిలవాలి. తీవ్ర ప్రభావిత మండలాల్లో బోర్లు ఆధారంగా పంటలను కాపాడుకునే అంశాన్ని పరిశీలించాలి.’’ అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు ఏ విధంగా ముందస్తు చర్యలు తీసుకున్నారో.. అదేవిధంగా ఇప్పుడు కూడా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
ఇలాంటి సమయంలో మంత్రుల నుంచి అధికార యంత్రాంగం వరకు అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా నింపాలన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఎల్‌నినో ప్రభావం, ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలు, రైతులకు కల్పించాల్సిన అవగాహన కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు. రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం ఏ మేరకు ఉంటుంది? దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై అధికారులు సీఎంకు వివరించారు. జూలైలో 69శాతం లోటు వర్షపాతం నమోదైందని, రానున్న 3నెలల్లో సరాసరి 35-40శాతం లోటు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. జూన్-నవంబరు మధ్య 84.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 55.1 సెంటీమీటర్ల మేరకు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. అంచనాలకుమించి ఎల్‌నినో ప్రభావం ఉండనుందన్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం అన్ని జిల్లాల్లోనూ ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉందని, ముఖ్యంగా పశ్చిమగోదావరి, ప్రకాశం, అన్నమయ్య, కృష్ణా, కడప జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకుంటాయని అధికారులు చెప్పారు.
లక్షల హెక్టార్లపై ప్రభావం
2.78 లక్షల హెక్టార్లలో పత్తి, 1.07 లక్షల హెక్టార్లలో వరి పంటపై ఎల్‌నినో ప్రభావం చూపుతుందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో వరికి ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందని వివరించారు. సీఎం స్పందిస్తూ, వంశధార నుంచి నీరు అందుబాటులోకి వస్తే ఆ నీటిని సద్వినియోగం చేసుకుని పంటలను కాపాలని ఆదేశించారు. రాష్ట్రంలో 122 తీవ్ర ప్రభావిత మండలాలను గుర్తించామని అధికారులు వివరించగా, ఆ మండలాల్లో బోర్లు ఆధారంగా పంటలను కాపాడుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే అంశంపై ఆగస్టు 3 నుంచి రైతులకు అవగాహన కార్యక్రమాలు, వరికి ప్రత్యామ్నాయ పంటలు, అత్యవసర విత్తన ప్రణాళికను రూపొందించినట్లు అధికారులు చెప్పారు. కంది, ఆముదం, మినుము వంటి పంటలను ఇప్పటికే కొందరు వేస్తున్నారన్నారు. ఫసల్‌బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల కింద 31 వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, వరికి ఆగస్టు 15వరకు సమయం ఉందన్నారు. ఇప్పటికే 6.30 లక్షల హెక్టార్లలో పంటలను బీమా కింద నమోదు చేశామని తెలిపారు.
బీమా చేయకపోతే.. కలెక్టర్లదే బాధ్యత
రైతు వేసిన ప్రతి పంటకూ బీమా నమోదు చేయాల్సిందేనని సీఎం నిర్దేశించారు. ఏ పంటకైనా బీమా నమోదు చేయకపోతే.. దానికి జిల్లా కలెక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చూసుకోవాలన్నారు. ఎల్‌నినో పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనా వేసి డేటాను విశ్లేషించాలని సూచించారు. డేటా ఆధారంగా సూచనలివ్వాలన్నారు. వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసేలా రైతు సేవా కేంద్రాల సిబ్బందిని అప్రమత్తం చేయాలని తెలిపారు. ‘‘భూగర్భ జలాల పరిస్థితిని కూడా తెలుసుకోవాలి. ఈ సమాచారానికి అనుగుణంగా రైతు సేవా కేంద్రాల ద్వారా సరైన మార్గదర్శకాలు ఇచ్చేలా అధికారులు కృషి చేయాలి. ఎల్‌నినో ప్రభావంపై రైతులకు సరైన సమాచారం అందించగలిగితే.. పెట్టుబడి వృథా కాదు.’’ అని చంద్రబాబు అన్నారు.
వ్యవసాయ విద్యార్థులతో అధ్యయనం
పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని, 5 నెలలకు సరిపడా 286.30 లక్షల టన్నుల పశుగ్రాసం అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. అది సరిపోదని, ఎల్‌నినో ప్రభావం ఏడాది పొడవునా కనిపించే సూచనలు ఉండటంతో ఏడాదికి అవసరమైన పశుగ్రాసాన్ని అందుబాటులో ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ‘‘పశువులకు దాణా కొరత ఉండకూడదు. పాల ఉత్పత్తి తగ్గడానికి వీల్లేదు. ఈ మేరకు వీబీజీరామ్‌జీ పథకాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. అలాగే ఉద్యాన పంటలకు వీబీజీరామ్‌జీ నిధులను వాడుకోవచ్చు.
మార్కెట్ యార్డు కమిటీలు, నీటి సంఘాల సభ్యులను ఎల్‌నినో అవగాహన కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలి. వాతావరణ పరిస్థితులను, పంటలను అధ్యయనం చేసేందుకు వ్యవసాయ విశ్వ విద్యాలయ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలి. ఈ మేరకు రైతుసేవాకేంద్రాల సిబ్బందిని కన్వీనర్లుగా నియమించుకుని, కార్యాచరణ అమలు కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. శాఖల మధ్య సమన్వయం తప్పకూడదు. కూరగాయల ధరలు సహా నిత్యావసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి.’’ అని సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ మొబైల్ రైతుబజార్లను ఏర్పాటు చేయాలన్నారు.
‘ఎల్‌నినో’ నుంచి రైతుల్ని ఆదుకోండి
సీఎంకు సీపీఐ నేత రామకృష్ణ విజ్ఞప్తి
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతుల్ని ఆదుకుని, ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును ఆయన కలిశారు. వర్షాభావం కారణంగా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. మంచినీటి ఎద్దడి లేకుండా సత్వర చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై సీఎం స్పందించారు. ప్రభుత్వం ఇప్పటికే ఎల్‌నినో సమస్యపై దృష్టి సారించిందని, ఆగస్టు 3 నుంచి అన్ని ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నామని చెప్పారు. తాగునీటి సమస్య రాకుండా యంత్రాంగానికి తగిన ఆదేశాలు జారీ చేశామన్నారు. అంతకుముందు విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 21 జిల్లాలు తీవ్రవర్షాభావ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో భూములు బీడుగా మారాయని, ఇప్పటికే సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బొండా ఉమా వివరణతో సంతృప్తి చెందిన అధిష్ఠానం
Read Latest AP News And Telangana News And International News And Telugu News