Share News

గుండు గీయించుకుంటే 15 వేలు చెల్లిస్తాం!

ABN , Publish Date - Jul 29 , 2026 | 06:09 AM

‘విక్రమార్కుడు’ సినిమా గుర్తుందా? అందులో డబ్బు కోసం హీరో స్వామీజీ వేషంలో మాయమాటలతో మహిళలకు అరగుండు కొట్టిస్తాడు. అదే తరహాలో ఓ ఆకతాయి.. మహిళలకు...

గుండు గీయించుకుంటే 15 వేలు చెల్లిస్తాం!

  • కొత్తరకం వ్యాధి రాదు..

  • మహిళలకు అజ్ఞాత వ్యక్తి ఫోన్‌

  • నిజమేనని నమ్మి గుండు

  • చేయించుకున్న మహిళలు

  • తమిళనాడులోని సేలంలో

  • ‘విక్రమార్కుడు’ తరహా ఘటన

చెన్నై, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ‘విక్రమార్కుడు’ సినిమా గుర్తుందా? అందులో డబ్బు కోసం హీరో స్వామీజీ వేషంలో మాయమాటలతో మహిళలకు అరగుండు కొట్టిస్తాడు. అదే తరహాలో ఓ ఆకతాయి.. మహిళలకు ఫోన్‌ చేసి గుండు చేయించుకుంటే రూ.15 వేలు చెల్లిస్తామని బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. దీనివల్ల కొత్తరకం వ్యాధి రాదని నమ్మబలికాడు. నిజమేనని నమ్మిన కొందరు మహిళలు గుండు కొట్టించుకున్నారు. ఆ తర్వాత ఇది ఆకతాయి పని అని తెలిసి లబోదిబోమన్నారు. తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడిలో ఇది జరిగింది. పుదుకొత్తంబాడికి చెందిన పళనియమ్మాళ్‌కు సోమవారం సాయంత్రం ఓ వ్యక్తి ఫోన్‌ చేసి తాను తాలూకా కార్యాలయ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఆ ప్రాంతంలోని మహిళలకు కరోనా లాంటి కొత్తరకం వ్యాధి వ్యాపిస్తోందని చెప్పాడు. విదేశాల్లో ఆ వ్యాధి బారినపడిన మహిళలంతా గుండు గీయించుకుని ప్రాణాలతో బయటపడ్డారని, అందువల్ల ఇక్కడా ఆ విధానాన్ని అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపాడు. అలా గుండు గీయించుకున్న మహిళలకు తలో రూ.15 వేలు.. పాఠశాల, కాలేజీ విద్యార్థినులైతే రూ.45 వేలు, ఉచిత ల్యాప్‌టాప్‌, పురుషులకైతే రూ.6వేలు చెల్లించాలని సీఎం ఉత్తర్వులు జారీ చేశారని తెలిపాడు. 18 మందికి మాత్రమే టోకెన్లు వచ్చాయని, రికార్డుల్లో పళనియమ్మాళ్‌ పేరు ముందున్నందున ఆమెకు ఫోన్‌ చేసినట్లు చెప్పాడు. పళనియమ్మాళ్‌ ఈ విషయం చుట్టుపక్కల అమ్మలక్కలందరికీ చెప్పేయడంతో వారు క్షురకుడిని పిలిపించుకుని గుండు గీయించుకోవడం మొదలుపెట్టారు. తొలిగా కావేరి, రామాయి, చిత్ర అనే మహిళలు గుండు చేయించుకున్నారు. అనంతరం ఆ అజ్ఞాత వ్యక్తికి ఫోన్‌ చేయగా... స్విచ్చాఫ్‌ వచ్చింది. దాంతో అనుమానం వచ్చిన పళనియమ్మాళ్‌ బృందం గుండు కార్యక్రమాన్ని నిలిపేసింది. తర్వాత వారంతా మోసపోయామని గ్రహించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పేపర్ లీక్‌లు అరికట్టేందుకే బిల్లు: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

అవకాశాలు సద్వినియోగం చేసుకోండి.. యువతకు నారా భువనేశ్వరి పిలుపు

For More National News And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 06:09 AM