Share News

అధికారుల నియామకం.. ప్రభుత్వ విచక్షణాధికారం

ABN , Publish Date - Jul 29 , 2026 | 06:02 AM

‘‘కోర్టు ధిక్కరణ కింద అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే.. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మీద గతంలో 400 కంటెంప్ట్‌ ఆఫ్‌ కోర్టు కేసులున్నాయి. అప్పుడు...

అధికారుల నియామకం.. ప్రభుత్వ విచక్షణాధికారం

  • ఆ హక్కును ఎవరూ బలవంతంగా గుంజుకోలేరు

  • మాజీ సీఎస్‌ సోమేశ్‌పై 400 కోర్టు ధిక్కరణ కేసులు

  • అధికారుల మార్పు నిబంధన ఉంటే అప్పుడు చెప్పలేదేం!?

  • మా ప్రభుత్వ విప్లవాత్మక సంస్కరణ.. హైడ్రా

  • బతుకమ్మ కుంటను బీఆర్‌ఎస్‌ వాళ్లు కబ్జా చేశారు

  • మళ్లీ వాళ్లే దానిపై కోర్టు ధిక్కరణ కేసులు వేశారు

  • హైడ్రాపై కబ్జాదారులే కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు

  • భవిష్యత్తులోనూ హైడ్రా పనులను కొనసాగిస్తాం

  • ఇకపై ఏ ఏడాది ఫీజులు ఆ ఏడాదే అడ్వాన్స్‌గా చెల్లిస్తాం

  • భారంగా మారింది బీఆర్‌ఎస్‌ పెట్టిన 8 వేల కోట్ల బకాయిలే

  • బీఆర్‌ఎస్‌ భ్రమల ప్రచారానికి వంత పాడుతున్న బీజేపీ

  • ఏపీలో బకాయిలపై ఆర్‌.కృష్ణయ్య మాట్లాడట్లేదేం?: రేవంత్‌

  • విద్యను రాష్ట్ర పరిధిలోనే ఉంచాలని, కోచింగ్‌ సెంటర్లపై

  • దేశవ్యాప్తంగా ఓ విధానం ఉండాలని కేంద్రానికి సూచన

  • హైడ్రా రంగనాథ్‌ కేసులో అప్పీలుకు ప్రభుత్వ నిర్ణయం

  • సాంకేతిక పరిశ్రమల స్వర్గధామం

  • వాటి ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పిస్తాం

  • తనను కలిసిన స్కైరూట్‌ సహ వ్యవస్థాపకులతో

  • ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. వారికి అభినందనలు

న్యూఢిల్లీ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ‘‘కోర్టు ధిక్కరణ కింద అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే.. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మీద గతంలో 400 కంటెంప్ట్‌ ఆఫ్‌ కోర్టు కేసులున్నాయి. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? సోమేశ్‌పై 400 కోర్టు ధిక్కరణ కేసులున్నా నాడు నోరు మెదపని వారు, ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. అధికారులు, ఉద్యోగుల కేటాయింపు.. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది సంపూర్ణంగా ప్రభుత్వ విచక్షణాధికారం. ఆ హక్కును ఎవరూ బలవంతంగా గుంజుకోలేరు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తప్పించాలని తెలంగాణ సీఎ్‌సకు సోమవారం హైకోర్టు సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఏడాదిన్నరలోనే ఆయనపై 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయని, ఆయనను కొనసాగిస్తే చట్టబద్ధ పాలనకు ప్రమాదమని కూడా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు తమ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణ ‘హైడ్రా’ అని కూడా తేల్చి చెప్పారు. న్యూఢిల్లీలోని కృషి భవన్‌లో మంగళవారం కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానాలపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ‘‘బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎడ్ల సుధాకర్‌ రెడ్డి 10 ఎకరాల బతుకమ్మ కుంటను కబ్జా చేసి అమ్ముకున్నాడు. ఆ తర్వాత కేసీఆర్‌ అక్కడికి వస్తే.. విమానం నుంచి పూలు చల్లాడు. పదెకరాల బతుకమ్మ కుంటను కబ్జా చేసి అమ్ముకున్నాక పూల వర్షమే కాదు.. బంగారమే చల్లుతారు. బతుకమ్మ కుంటను బీఆర్‌ఎస్‌ నాయకులు కబ్జా పెట్టుకున్నారు.


దానిపై వాళ్లే కోర్టు ధిక్కరణ కేసులు వేశారు. దీనిని ఏవిధంగా చూడాలి?’’ అని రేవంత్‌ రెడ్డి నిలదీశారు. హైడ్రా విషయంలో కబ్జాకోరులు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘‘హైడ్రా మంచి పనులు చేస్తోంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రేటెస్ట్‌ రిఫార్మ్‌ ‘హైడ్రా’. అత్యుత్తమ సంస్థల్లో ఒకటి. ప్రభుత్వ పార్కులు, చెరువులు, కుంటలు, నాలాలను కాపాడటమే హైడ్రా విధి. ఆ పనిని పకడ్బందీగా చేస్తోంది. ఎన్‌ కన్వెన్షన్‌ను కూలగొట్టింది. గండిపేట చెరువులో ఆక్రమణలు కూలగొట్టింది. అవి పేదోళ్లవా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్నోళ్లు పేదోళ్లా?’’ అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పని చేయకుండా హైడ్రాను అడ్డుకునే కబ్జాదారులకు సహకరించవద్దని కోరారు. కబ్జాదారులను కాపాడటానికి డబ్బులు పెట్టి సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘హైడ్రా కార్యాచరణ, బాధ్యతలపై ప్రభుత్వానికి స్పష్టత ఉంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇంకా పరిశీలించలేదు. ప్రభుత్వపరంగా సమీక్షిస్తాం. కోర్టు ఆదేశాలను, న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. భవిష్యత్తులోనూ హైడ్రా పనులను కొనసాగిస్తాం’’ అని స్పష్టం చేశారు.

ఏ ఏడాది ఫీజులు ఆ ఏడాదే చెల్లింపు

భవిష్యత్తులో ఏ సంవత్సరానికి సంబంధించిన ఫీజుల మొత్తాన్ని అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తామని, అడ్వాన్స్‌డ్‌గా బ్యాంక్‌ ఖాతాల్లో వేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2,200-2,400 కోట్లు అవసరమవుతాయని స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా వాటిని చెల్లించేందుకు ప్రణాళికలు రచించామని, భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సమస్య ఉత్పన్నం కాదని తెలిపారు. ‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి కేసీఆర్‌ ప్రభుత్వం రూ.8 వేల కోట్ల బకాయిలను పెట్టి పోయింది. కేసీఆర్‌ పెట్టిన బకాయిలే మాకు భారంగా మారాయి. కానీ, మేం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదన్నట్లుగా, మా ప్రభుత్వం కారణమన్నట్లుగా బీఆర్‌ఎస్‌ భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తోంది. దానికి బీజేపీ వంతపాడుతోంది’’ అని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు బకాయిలపై బీజేపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. కూటమి ప్రభుత్వం ఉన్న ఏపీలో 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయించిన తర్వాత తెలంగాణలో డిమాండ్‌ చేస్తే బాగుంటుందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు రామచందర్‌రావు, ఆ పార్టీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్యలకు హితవు పలికారు. ఎలాంటి వసతులు లేకుండా, దొంగ లెక్కలు చూపించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కొట్టేయాలనుకునే సంస్థల మీద విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ సాగుతోందని, సక్రమంగా ఉన్న వాళ్లకు బకాయిలు చెల్లిస్తామని ఓ ప్రశ్నకు సీఎం బదులిచ్చారు.


విద్యను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంచాలి

‘‘యూనివర్సిటీల మీద ఆధిపత్యం చెలాయించాలనే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలి. విద్యను వీలైనంత వరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంచితే తప్పిదాలకు అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలి. అప్పుడు రాహుల్‌ గాంధీ అన్ని అంశాలపై మాట్లాడతారు’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రశ్న పత్రాల లీకేజీలకు కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ‘‘అనుమతి లేకుండానే దేశంలో కోచింగ్‌ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అవి ప్రశ్న పత్రాలు లీక్‌ అవ్వడానికి వేదికలుగా మారుతున్నాయి. దీనిపై దేశస్థాయిలో ఒక విధానాన్ని రూపొందించాలి’’ అని అభిప్రాయపడ్డారు. ప్రశ్న పత్రాల లీకేజీల నివారణకు కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాన్ని చూసిన తర్వాత రాష్ట్రంలో ఏం చేయాలనేది చూస్తామని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టామని, పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని తెలిపారు. విద్యార్థులకు నమ్మకం, విశ్వాసం కలిగించేలా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్లోబరీనా వంటి సంస్థలు అక్రమాలకు పాల్పడినా గత ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో వాళ్లు సీబీఎ్‌సఈ పరీక్షల వరకు విస్తరించి, వాటిని కూడా గందరగోళం చేశారని విమర్శించారు. తెలంగాణలో పరిస్థితుల పరిశీలనకు క్షేత్రస్థాయి పర్యటనకు రావాలని కేంద్ర మంత్రి చౌహాన్‌ను ఆహ్వానించినట్లు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పేపర్ లీక్‌లు అరికట్టేందుకే బిల్లు: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

అవకాశాలు సద్వినియోగం చేసుకోండి.. యువతకు నారా భువనేశ్వరి పిలుపు

For More National News And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 06:03 AM