Share News

ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగు

ABN , Publish Date - Jul 29 , 2026 | 02:51 AM

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. వీటిలో పలు అంశాలను వైద్యారోగ్యశాఖ ప్రామాణికంగా తీసుకొని జూన్‌ నెలకు సంబంధించి గ్రేడింగ్‌లు ఇచ్చింది.

ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగు
జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన ఈతముక్కల పీహెచ్‌సీ

అన్ని విభాగాల్లోనూ ముందంజ

39 పీహెచ్‌సీల్లో కేవలం నాలుగే సీగ్రేడ్‌

కాన్పుల విషయంలో కొన్ని వెనుకబాటు

ఒంగోలు కలెక్టరేట్‌, జూలై 28 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. వీటిలో పలు అంశాలను వైద్యారోగ్యశాఖ ప్రామాణికంగా తీసుకొని జూన్‌ నెలకు సంబంధించి గ్రేడింగ్‌లు ఇచ్చింది. ప్రకాశం జిల్లాలో ఉన్న మొత్తం 39 పీహెచ్‌సీలలో 15 ఏ-గ్రేడ్‌ సాధిం చాయి. 20 పీహెచ్‌సీలకు బీ-గ్రేడ్‌ లభించింది. నాలుగు మాత్రమే సీ-గ్రేడ్‌లో ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలకు సంబంధించి ప్రజాప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ప్రతి రోగి పట్ల వైద్యాధికారులు జవాబుదారీతనంగా ఉండేలా చూడడంతోపాటు వారికి అవసరమైన వైద్య పరీక్షలు, మందులను అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం పీహెచ్‌సీలకు గ్రేడింగ్‌లు ఇస్తోంది.

ప్రథమస్థానంలో ఈతముక్కల పీహెచ్‌సీ

ఒక్కో పీహెచ్‌సీలో అవుట్‌ పేషెంట్‌ (ఓపీ), ఇన్‌పేషెంట్‌ (ఐపీ), డెలివరీ, ల్యాబ్‌ టెస్టులను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం జూన్‌ నెలకు సంబంధించి గ్రేడింగ్‌లను ఇచ్చింది. మొత్తం నాలుగు అంశాల్లో మూడింటిలో అన్ని పీహెచ్‌సీలు మెరుగైన స్థానాల్లో నిలిచాయి. కాన్పుల విషయంలో మాత్రం కొన్ని వెనుకబడి ఉన్నాయి. కొత్తపట్నం మండలం ఈతముక్కల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో, రాష్ట్రస్థాయిలో 64వ స్థానంలో నిలిచింది. జె.పంగులూరు పీహెచ్‌సీ జిల్లా స్థాయిలో ద్వితీయ, రాష్ట్రంలో 95వ స్థానంలో ఉంది. మిగిలిన పీహెచ్‌సీలు రాష్ట్ర స్థాయిలో 100 నుంచి 111 స్థానాల్లో ఉన్నాయి. చాకిచర్ల, అమ్మనబ్రోలు, టంగుటూరు, మర్రిపూడి పీహెచ్‌సీలు సీ గ్రేడ్‌కు పరిమితమయ్యాయి.

Updated Date - Jul 29 , 2026 | 02:51 AM