Share News

ఊరూరా సారా!

ABN , Publish Date - May 26 , 2026 | 10:45 AM

గ్రామాల్లో నాటుసారా ఏరులై పారుతోంది. విచ్చలవిడిగా తయారు చేసి, విక్రయిస్తున్నారు.

ఊరూరా సారా!
Ananthapuram

  • కొండగుట్టలు, వంకల్లో బట్టీలు

  • యథేచ్ఛగా తయారీ

  • ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయాలు

  • తూతూమంత్రంగా ఎక్సైజ్‌ అధికారుల దాడులు

ధర్మవరం(అనంతపురం): గ్రామాల్లో నాటుసారా ఏరులై పారుతోంది. విచ్చలవిడిగా తయారు చేసి, విక్రయిస్తున్నారు. కట్టడి చేయాల్సిన ఎక్సైజ్‌ అధికారులు తూతూమంత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైసీపీ హయాం నుంచీ నాటుసారా తయారు చేసి, విక్రయాలు సాగిస్తూనే ఉన్నారు. కొండలు, గుట్టలు, వంకల్లో సారా తయారు చేస్తున్నారు. ప్రభుత్వం నాటుసారాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. నాటుసారా అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. అధికారులు వాటిని తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. దీంతో నాటుసారా తయారీ, విక్రయాలు యథేచ్ఛగా సాగిస్తున్నట్లు సమాచారం.


ఎక్కడెక్కడ తయారు చేస్తున్నారంటే...

నాటుసారా తయారీనీ ధర్మవరం మండలంలోని నేలకోటతండా, నడిమిగడ్డపల్లి తండా, ఓబుళనాయునపల్లి తండా సమీప కొండల్లో, ముదిగుబ్బ మండలంలోని అడవిబ్రహ్మణపల్లి తండా, గరుగుతండా, గుడ్డంపల్లి తండా, కామిరెడ్డిపల్లి, పర్వతదేవరపల్లి మధ్యలోని ముళ్లపొదల్లో నాటుసారా తయారుచేసి, అనంతపురం తరలిస్తున్నట్లు సమాచారం. బయటప్రాంతాలకు కూడా రవాణా చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఎక్సైజ్‌ అధికారులు చేసిన దాడుల్లో నాటుసారా పట్టుబడింది. కేసులు నమోదుచేసినట్లు అధికారులు తెలిపారు.


కేసులు నమోదు చేస్తాం

గ్రామాల్లో నాటుసారా తయారీచేసినా, విక్రయించినా ఉపేక్షించేది లేదు. నాటుసారా ఊటలపై దాడులు నిర్వహించి, ధ్వంసం చేస్తాం. ఇప్పటికే పలుగ్రామాల్లో ఎక్సైజ్‌ అధికారులతో పాటు ప్రత్యేక బృందాలు నిఘా వేసి, దాడులు నిర్వహిస్తున్నాం. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాం.

  • చంద్రమణి, ఎక్సైజ్‌ సీఐ, ధర్మవరం


sara1.2.jpgయథేచ్ఛగా విక్రయాలు

గ్రామాల్లో నాటుసారాను తయారుచేసి, యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం. కొంతమంది పోలీసులు మామూళ్ల మత్తులో తూతూమంత్రంగా దాడులు చేసి, వదిలేస్తుండడంతో తయారీని అపడం లేదని బహిరంగంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. కొన్నిగ్రామాల నుంచి బయట ప్రాంతాలకు కూడా తరలించి, సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం.


ఆరోగ్యానికి చేటు

నాటుసారాకు అలవాటుపడితే ఆరోగ్యానికి చేటు తెచ్చుకున్నట్లేనని వైద్యులు చెబుతున్నారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు నాటుసారా తాగి ఒక్కోసారి తీవ్ర అస్వస్థతకు లోనవుతున్నట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. అయినా తయారీ, విక్రమాలు మాత్రం ఆగట్లేదు.


ఈ వార్తలు కూడా చదవండి:

గుడ్‌న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు..

భోగాపురానికి వస్తున్నాం!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 26 , 2026 | 10:45 AM