Share News

శుభగడియలొచ్చాయ్‌

ABN , Publish Date - Jun 19 , 2026 | 11:20 AM

పరాభవ నామ సంవత్సరంలో వచ్చిన అధిక జ్యేష్ఠ మాసం కారణంగా మే 14 నుంచి జూన్‌ 15వ తేదీ వరకు శుభమూహుర్తాలకు బ్రేక్‌ పడింది.

శుభగడియలొచ్చాయ్‌
Marriage Muhurtham 2026

  • నేటి నుంచి మోగనున్న పెళ్లి బాజాలు

  • జూలై 15 నుంచి ఆషాఢం

అధిక జ్యేష్ఠ మాసం ముగియడంతో మళ్లీ శుభగడియలు ప్రారం భమయ్యాయి. దీంతో శుక్రవారం నుంచి వివాహాలు, గృహప్రవేశాలు, నిశ్చితార్థాలు తదితర శుభకార్యాలు జరగనున్నాయి. ఈ క్రమంలో పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ సందడి నెలకొంటోంది. శుభకార్యాలు చేసుకునేందుకు ప్రజలు ముహూర్తాలు పెట్టుకుని సిద్ధమవుతుండగా.. వాటిపై ఆధారపడిన వృత్తివర్గాలు వారు చేతినిండా పని దొరకనుండడంతో బిజీ అవనున్నారు.

ధర్మవరం(అనంతపురం): పరాభవ నామ సంవత్సరంలో వచ్చిన అధిక జ్యేష్ఠ మాసం కారణంగా మే 14 నుంచి జూన్‌ 15వ తేదీ వరకు శుభమూహుర్తాలకు బ్రేక్‌ పడింది. ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. దీంతో 36 రోజుల పాటు కల్యాణమండపాలు, ఫంక్షన్‌హాళ్లు, కేటరింగ్‌ నిర్వాహకులు, డెకరేషన్‌ నిర్వాహకులు, పూల వ్యాపారులు, పురోహితులు, ఫొటో గ్రాఫర్లు, బ్యాండ్‌మేళం వారికి ఉపాధిలేకుండా పోయింది.


ఆషాఢ మాసంతో బ్రేక్‌..

జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు 12వరకు ఆషాడ మాసం(శూన్యమాసం) ఉండటంతో మళ్లీ శుభముహుర్తాలకు విరామం రానుంది. ఆ తరువాత ఆగస్టు 16 నుంచి మళ్లీ వివాహాలు, ఇతర శుభకారాలకు అనుకూలమైన ముహూర్తాలు ప్రారంభమవుతాయి.

నేటి నుంచి శుభముహూర్తాలు

నిజ జ్యేష్ఠ మాసంలో శుక్రవారం నుంచి జూలై 10వ తేదీ వరకు వివాహాలు, గృహప్రవేశాలకు అనుకూలమైన ముహూర్తాలు ఉన్నాయి. వేదపండితుల ప్రకారం ఈనెల 19, 20, 21, 24, 25, 26, 27, 28వ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే జూలై 1, 2, 3, 4, 5, 8, 9వ తేదీ ల్లోనూ శుభకార్యాలు నిర్వహించవచ్చు.


జోరందుకున్న బుకింగ్స్‌..

శుక్రవారం నుంచి శుభ ముహూర్తాలు ఉండడంతో కల్యాణమండపాలు, ఫంక్షన్‌ హాళ్లు, క్యాటరింగ్‌, డెకరేషన్‌ నిర్వాహకులు, పూల వ్యాపారులు, బంగారు దుకాణాలు, వస్త్ర వ్యాపారులు ఇప్పటికే బుకింగ్స్‌తో బిజీగా మారారు. వివాహాల కోసం జాతకాలు చూపించుకునే వారి రాకతో పురోహితులు, జ్యోతిష్య పండితులు కూడా తీరిక లేకుండా ఉన్నారు.

ఏం చేయవచ్చంటే..

అధిక మాసం, మూఢకాలంలో సాధారణంగా వివాహాలు, గృహప్రవేశాలు నిర్వహించలేకపోయినా, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, సీమంతాలు, రిజిస్ట్రేషన్లు వంటి కార్యక్రమాలు చేపట్టవచ్చని పండితులు సూచిస్తున్నారు.


marra.jpgనేటి నుంచి మంచి ముహూర్తాలు

శుక్రవారం నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. అధిక జ్యేష్ఠమాసం కారణంగా 36రోజుల పాటు శుభకార్యాలకు విరామం ఏర్పడింది. దీంతో ఈ రంగాలపై ఆధారపడిన అనేకమందికి ఉపాధి లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ ముహూర్తాలు ప్రారంభం కావడంతో వేలాది మందికి పని దొరకనుంది.

- రాజేశ్‌, అర్చకుడు, ధర్మవరం


ఇకపై బిజీగా ఉంటాం

నెల రోజులకుపైగా ముహూర్తాలు లేక ఖాళీగా కుర్చున్నాం. నేటి నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి. ఇకపై బిజీగా ఉంటాం. అప్పుడే ఆర్డర్లు కూడా వస్తున్నాయి. ఆషాఢం వచ్చేలోగా బాగా ఆర్డర్లు వస్తాయి. ఆషాఢం రాగానే మళ్లీ ఆగస్టు 15 వరకు వ్యాపారాలు ఉండవు.

- కత్తేకొట్టాల గురుప్రసాద్‌, సప్లయర్‌ యజమాని


ఈ వార్తలు కూడా చదవండి:

‘ఇండస్ట్రియల్ హబ్‌గా ఏపీ’.. పారిశ్రామికవేత్తలకు లోకేశ్ ఆహ్వానం

కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 19 , 2026 | 11:20 AM