Share News

Meenakshi Natarajan VS BJP: మోదీ ప్రభుత్వం ఓటు హక్కును హరిస్తోంది.. మీనాక్షి నటరాజన్ ధ్వజం

ABN , Publish Date - Aug 25 , 2025 | 09:55 PM

బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం మోదీ ప్రభుత్వానికి ఇష్టం లేదని కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ఓటు హక్కును హరిస్తోందని ఆక్షేపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని ఉద్ఘాటించారు.

Meenakshi Natarajan VS BJP: మోదీ ప్రభుత్వం ఓటు హక్కును హరిస్తోంది.. మీనాక్షి నటరాజన్  ధ్వజం
Meenakshi Natarajan VS BJP

వరంగల్, ఆగస్టు25 (ఆంధ్రజ్యోతి): బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం మోదీ ప్రభుత్వానికి (Modi Govt) ఇష్టం లేదని కాంగ్రెస్ (Congress) తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) ఆరోపించారు. బీజేపీ (BJP) ప్రభుత్వం ఓటు హక్కును హరిస్తోందని ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని ఉద్ఘాటించారు. బీసీ రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశారని గుర్తుచేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రిజర్వేషన్లపై పోరాడారని చెప్పుకొచ్చారు. వరంగల్ జిల్లాకు ఇవాళ (సోమవారం) జనహిత పాదయాత్ర చేరుకుంది. ఇల్లంద నుంచి వర్థన్నపేట వరకు జనహిత పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రలో మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.


ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్‌లో మీనాక్షి నటరాజన్ మాట్లాడారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డిని కూడా అమిత్ షా, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. జనహిత పాదయాత్రలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఎలా అందుతున్నాయో తెలుసుకున్నామని వెల్లడించారు. తమ ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని ఉద్ఘాటించారు. ఓటు చోరీపై రాహుల్ గాంధీ ఉద్యమిస్తున్నారని నొక్కిచెప్పారు. ఓటు వేయడం మన హక్కు..కానీ ఆ హక్కును హరిస్తే ఏం చేయాలని ప్రశ్నించారు. బీహార్‌లో ఓటర్ల జాబితా నుంచి ఓట్లు గల్లంతు ఎందుకయ్యాయని కేంద్రాన్ని నిలదీశారు. రాహుల్‌గాంధీ ఎక్కడకు వెళ్లిన తెలంగాణ మోడల్ గురించే మాట్లాడుతున్నారని మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు.

Congress-Janhita-Padayatra-.jpg


డీకే అరుణకు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్

జనహిత పాదయాత్రలో ఏబీఎన్‌తో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. డీకే అరుణకు మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం తమ చేతుల్లో లేదని చెప్పుకొచ్చారు. దొంగ ఓట్లపై తామేలా లెక్కలు తేలుస్తామని ప్రశ్నించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందని.. మీరే లెక్కలు తేల్చాలని సవాల్ చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ముమ్మాటికీ బీసీ కాదని ఆరోపించారు. బీసీల కోసం మాట్లాడని ఆయన బీసీ ఎలా అవుతారని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.


ఓట్ చోరీ ద్వారానే ఎంపీలు గెలిచారు: మంత్రి కొండా సురేఖ

ఓట్ చోరీ ద్వారానే తెలంగాణలో బీజేపీ ఏడు ఎంపీ స్థానాలు గెలిచిందని.. దీనిపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. బీజేపీ ప్రజల ఆదరణ కోల్పోయిందని ఆరోపించారు. అధికారంలో ఉన్న పార్టీ పాదయాత్ర చేయడం అరుదని చెప్పుకొచ్చారు. ఇది ఎప్పుడూ జరగలేదని, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే అది సాధ్యమని ఉద్ఘాటించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు కాంగ్రెస్ గెలవాలంటే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. అయితే, జనహిత పాదయాత్రలో మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ నేతలు డ్యాన్స్ చేశారు.

Congress-Janhita-10.jpg


సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెలుసుకోవడానికి పాదయాత్ర: వేం నరేందర్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను తెలుసుకునేందుకే ఈ పాదయాత్ర చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి తెలిపారు. రైతులకు రూ.70వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం తమదని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులను గర్వంగా చెప్పుకునేందుకే ఈ పాదయాత్ర చేస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వేం నరేందర్ రెడ్డి సూచించారు.


యూరియా కొరత సృష్టిస్తున్నారు: యశస్వినిరెడ్డి

కొన్ని చోట్ల సొసైటీ డైరెక్టర్లుగా ఉన్న బీఆర్ఎస్ నేతలు కావాలనే యూరియా కొరత సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి విమర్శించారు. నిన్న రాయపర్తిలో సొసైటీ డైరెక్టర్‌గా ఉన్న బీఆర్ఎస్ నేత ఇంట్లో యూరియా అక్రమంగా నిల్వ ఉంచారని ఆరోపించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. రైతులు బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మొద్దని యశస్వినిరెడ్డి సూచించారు.


ఒక్కటైన కాంగ్రెస్ నేతలు

జనహిత పాదయాత్రలో విభేదాలు వీడి కాంగ్రెస్ నేతలు ఒక్కటయ్యారు. జనహిత పాదయాత్రలో ఒకే వేదికపై కొండా దంపతులు, ఎమ్మెల్యేలు ఆసీనులయ్యారు. కొంత కాలం నుంచి కొండా దంపతులు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, వేం నరేందర్ రెడ్డిని వేదికపైకి కొండా మురళీ ఆహ్వానించారు.


పాదయాత్రకు దూరంగా కడియం శ్రీహరి

కాంగ్రెస్ జనహిత పాదయాత్రకు దూరంగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశం కోర్టులో ఉండటంతో కాంగ్రెస్ పాదయాత్రకు కడియం శ్రీహరి హాజరు కాలేదు. కడియం గైర్హాజరుపై మీటింగ్‌లో చర్చ జరిగింది.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో దారుణం.. యజమానిపై అమానుష దాడి

వారిద్దరూ రాహుల్‌‌‌ని ఆటలో అరటిపండుగా మార్చారు: కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 26 , 2025 | 11:11 AM