Share News

Fish Seed Production: చేపా చేపా ఎందుకు పెరగట్లే.. మత్స్యకారుల ఆవేదన

ABN , Publish Date - Sep 25 , 2025 | 08:17 AM

నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఇండ్లకోటయ్యగూడెం వద్ద ఉన్న బీజోత్పత్తి క్షేత్రంలోని చేపలు ‘చేపా చేపా ఎందుకు పెరగట్లే అంటే పట్టించుకునే వారేరని అంటున్నట్లు ఉన్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Fish Seed Production: చేపా చేపా ఎందుకు పెరగట్లే.. మత్స్యకారుల ఆవేదన
Fish Seed Production

  • నిర్లక్ష్యం నీడన ‘ఇండ్లకోటయ్యగూడెం’ మత్స్య బీజ క్షేత్రం

  • చేప పిల్లల ఉత్పత్తి అంతంతమాత్రమే

  • పట్టించుకోని అధికారులు

నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఇండ్లకోటయ్యగూడెం (Indlakotayya Gudem) వద్ద ఉన్న బీజోత్పత్తి క్షేత్రంలోని చేపలు ‘చేపా చేపా ఎందుకు పెరగట్లే అంటే పట్టించుకునే వారేరని అంటున్నట్లు ఉన్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విస్తారమైన భూమి, నీటి వనరులు ఉన్నా ఈ క్షేత్రం నిర్వహణ అధ్వానంగా మారడంతో తమకు ఈ పరిస్థితి దాపురించిందని చేపలు మొరపెట్టుకున్నట్లే ఉందని మత్స్యకారులు చెబుతున్నారు. నర్సరీల్లో మాత్రమే ఏదో మొక్కుబడిగా పిల్లలను పెంచుతున్నారు. కానీ పాండ్స్‌ వృథాగా ఉంటున్నాయని, దీంతో ఈ క్షేత్రం మత్స్యకారులకు ఎలాంటి చేయూతనివ్వడం లేదని వారంటున్నారు.


(ఆంధ్రజ్యోతి-నిడమనూరు): మత్స్యసంపదను పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడం శివారు ఇండ్లకోటయ్యగూడెం గ్రామంలో 1990లో 75 ఎకరాల విస్తీర్ణంలో మత్స్య బీజ క్షేత్రం ఏర్పాటు చేసింది. 2.5 కోట్ల చేపపిల్లలు ఉత్పత్తి చేసేందుకు అవసరమైన 20 నర్సరీలు, 38 పాండ్స్‌ నిర్మించింది. ఉత్పత్తి చేసిన చేపపిల్లలను జిల్లాలోని మత్స్య సొసైటీల ద్వారా చెరువుల్లో వదిలి మత్స్య సంపదను అభివృద్ధి చేయడంతో పాటు మత్స్యకారులకు దోహదం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.


అయితే మొదట్లో ఇక్కడ ఉత్పత్తి చేసిన చేపపిల్లలను చుట్టుపక్కల మండలాల్లోని చెరువుల్లో వదిలే వారు. కానీ గత ప్రభుత్వం మత్స్య బీజ క్షేత్రం నిర్వహణను వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్‌ ఏజెన్సీకి లీజుకు అప్పగించింది. కానీ మూడేళ్ల పాటు ఇక్కడ ఎలాంటి ఉత్పత్తి చేపట్టలేదు. అనంతరం అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు లీజు రద్దు చేయించారు. దీంతో ఇటీవలి ప్రభుత్వమే దీనిని నిర్వహిస్తోంది.


ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోళ్లు

నల్లగొండ జిల్లాలో 249 మత్స్య సహకార సొసైటీలు పనిచేస్తున్నాయి. ఇండ్లకోటయ్యగూడెం మత్స్య బీజ క్షేత్రంలో లక్ష్యం మేరకు చేపపిల్లలు ఉత్పత్తి చేస్తే సొసైటీల పరిధిలోని చెరువులకు చేపపిల్లలు పంపిణీ చేయవచ్చు. మత్స్యకారులకు కూడా చేయూతనిచ్చేందుకు ఎంతో కొంత దోహదపడుతుంది. కానీ క్షేత్రం నిర్లక్ష్యానికి గురికావడంతో చెరువుల్లో వదిలేందుకు సరిపడా చేపపిల్లల ఉత్పత్తి లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను కొనుగోలు చేయాల్సి వస్తోంది. చెరువుల్లో ఎంతమేరకు వదులుతున్నారో తెలియని పరిస్థితి ఉంది. అధికారులు మాత్రం లక్షల సంఖ్యలో పిల్లలను వదులుతున్నట్లు చెబుతున్నారు. చేపపిల్లల కొనుగోలులో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని సొసైటీల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అఽధికారుల నిర్ల క్ష్యం కారణంగా మత్స్య సొసైటీ సభ్యులు కూడా నష్టపోతున్నారు.


30 లక్షల చేపపిల్లల ఉత్పత్తి

మత్స్య బీజ క్షేత్రంలో చేపపిల్లల ఉత్పత్తి విషయంలో కూడా పొంతనలేని సమాధానాలు వినిపిస్తున్నాయి. సరైన వివరణ ఇచ్చేవారే కరువయ్యారు. ఈ ఏడాది 30 లక్షల మేరకు చేపపిల్లలను ఉత్పత్తి చేస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నా అక్కడ ఎలాంటి చేపపిల్లల సీడ్‌ కనిపించడం లేదు. మూడు కోట్ల మేరకు పిల్లలను ఉత్పత్తి చేసేందుకు అవసరమైన నర్సరీలు ఉన్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా నర్సరీలు, పాండ్స్‌ వృథాగా ఉంటున్నాయి.


వేధిస్తోన్న సిబ్బంది కొరత

మత్స్య బీజ క్షేత్రాన్ని సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇక్కడ ఎఫ్‌డీవోతో పాటు కొందరు సిబ్బంది ఉండాల్సి ఉన్నప్పటికీ అక్కడ ఎవరూ ఉండటం లేదు. కేవలం ఫిషర్‌మెన్‌, ఫీల్డ్‌మెన్‌ మాత్రమే ఉంటున్నారు. కనీసం వాచ్‌మెన్‌ కూడా లేడు. సరైన సిబ్బంది లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడం తదితర కారణాల మూలంగా క్షేత్రం నిరుపయోగంగా కనిపిస్తుంది. క్షేత్రం నిర్వహణను భువనగిరి మత్స్యశాఖ ఏడీకి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన ఇంతవరకు క్షేత్రాన్ని సందర్శించిన దాఖలాలు లేవు.


పర్యవేక్షణ లేకపోవడంతో మత్స్య బీజ క్షేత్రానికి చెందిన 75 ఎకరాల భూమిలో కొంత ఆక్రమణకు గురవుతోంది. ప్రస్తుతం 63ఎకరాల వరకు మాత్రమే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా క్షేత్రం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని పలువురు వాపోతున్నారు. పలువురు మద్యం తాగడం, పేకాట ఆడటం జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. చేపపిల్లలను ఉత్పత్తి చేసి సొసైటీలకు సరఫరా చేసి చెరువుల్లో వదిలేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సొసైటీల బాధ్యలు కోరుతున్నారు. కాగా మత్స్య బీజ క్షేత్రం నిర్వహణపై అధికారుల వివరణ కోరేందుకు వెళ్లగా అక్కడ ఎవరూ అందుబాటులో లేరు. ఫోన్‌లో కూడా సంప్రదించేందుకు ప్రయత్నించగా అధికారులు అందుబాటులోకి రాలేదు.


నాణ్యమైన చేపపిల్లలు ఉత్పత్తి చేయాలి

ఇండ్లకోటయ్యగూడెంలోని మత్స్య బీజ క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిర్వహణకు సరిపడా నిధులు కేటాయించాలి. నాణ్యమైన చేపపిల్లలు ఉత్పత్తి చేసి చెరువులకు పంపిణీ చేయాలి. మత్స్యకారులకు మేలు చేసేలా మత్స్య బీజ క్షేత్రాన్ని నిర్వహిస్తే మత్స్యకారులకు ప్రయోజనం ఉంటుంది.

-ఎం.వెంకటయ్య, మాజీ మత్స్య సహకార సంఘం చైర్మన్‌, నిడమనూరు


ఈ వార్తలు కూడా చదవండి

విదేశాల్లో బతుకమ్మ సందడి.. కవిత పర్యటనకు కోర్టు అనుమతి

ఆర్టీసీ కీలక నిర్ణయం.. కొత్తగా 10 డిపోలు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 25 , 2025 | 08:20 AM