Kavitha Qatar visit: విదేశాల్లో బతుకమ్మ సందడి.. కవిత పర్యటనకు కోర్టు అనుమతి
ABN , Publish Date - Sep 25 , 2025 | 08:06 AM
తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మరోసారి విదేశీ పర్యటనకు సిద్దమయ్యారు. ఈరోజు ఉదయం ఢిల్లీకి బయల్దేరి, అక్కడి నుంచి సాయంత్రం ఖతార్ వెళ్లనున్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) ఈ రోజు ఉదయం ఢిల్లీకి బయల్దేరారు. సాయంత్రం ఢిల్లీ నుంచి ఖతార్‌కు వెళ్లనున్నారు. ఈ విదేశీ పర్యటనకు ఢిల్లీ రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ రోజు హర్యానాలో మాజీ ఉప ప్రధాని దేవిలాల్ జయంతి వేడుకల్లో కవిత పాల్గొననున్నారు. అనంతరం, విదేశాల్లో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఖతార్, మాల్టా, లండన్‌లలో జరిగే కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు.
సెప్టెంబర్ 26న ఖతార్‌లో తెలంగాణ జాగృతి ఖతార్ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశీ తెలుగు సమాజానికి పరిచయం చేయనున్నారు. సెప్టెంబర్ 27న మాల్టాలో తెలంగాణ జాగృతి మాల్టా శాఖ నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో కవిత పాల్గొంటారు. ఇక సెప్టెంబర్ 28న లండన్‌లో జాగృతి యూకే శాఖ ఆధ్వర్యంలో జరిగే బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ సంప్రదాయ నృత్యాలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేయనున్నారు.
ఈ వేడుకల ద్వారా తెలంగాణ సంస్కృతిని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడం, విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారిని ఒక తాటిపైకి తీసుకురావడం కవిత లక్ష్యం. ఈ పర్యటనలో ఆమె తెలంగాణ జాగృతి శాఖలతో కలిసి పనిచేస్తూ, స్థానిక తెలుగు సమాజంతో సమావేశాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 29న కవిత హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. తెలంగాణ జాగృతి ద్వారా బతుకమ్మ వేడుకలు విదేశాల్లో ఘనంగా జరపడం ద్వారా తెలంగాణ కల్చర్ ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పే ప్రయత్నం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి