Organ Donation Awareness: జీవిద్దాం రండి... అవయవదానంతో పునర్జన్మ
ABN , Publish Date - Aug 13 , 2025 | 09:04 AM
'మీరు చనిపోయినా మీ కళ్లు అందమైన అమ్మాయిల్ని చూడాలని కోరుకుంటున్నారా! అయితే నేత్రదానం చేద్దాం..' అనేది ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక ప్రకటన సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయిన ఈ ప్రకటన యువతలో నేత్రదానంపై అవగాహన తీసుకొచ్చింది ఈ ప్రకటన. యువతను ఆలోచింప చేసిందనడంలో అతిశయోక్తి లేదు.
» నేడు జాతీయ అవయవదాన దినోత్సవం
» కావాల్సింది యువచైతన్యమే
ఖమ్మం కలెక్టరేట్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): 'మీరు చనిపోయినా మీ కళ్లు అందమైన అమ్మాయిల్ని చూడాలని కోరుకుంటున్నారా! అయితే నేత్రదానం చేద్దాం..' (Eye Donation) అనేది ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక ప్రకటన సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయిన ఈ ప్రకటన యువతలో నేత్రదానంపై అవగాహన తీసుకొచ్చింది ఈ ప్రకటన. యువతను ఆలోచింప చేసిందనడంలో అతిశయోక్తి లేదు. మరి కేవలం కళ్లను దానం చేస్తే అందమైన లోకాన్ని చూడొచ్చు. మరి చనిపోయినా మళ్లీ బతకడం ఎలా? దీనికి కూడా అవకాశం ఉంది. అదే అవయవదానం, వైద్య పరిభాషలో బ్రెయిన్ డెడ్ అయిన, లేదంటే చనిపోయిన వ్యక్తుల అవయవాలను నిమిషాల వ్యవధిలో వేరొకరికి అమర్చడం ద్వారా ఇతరులకు పునర్జన్మ ప్రసాదించి, తద్వారా చనిపోయినా జీవించి ఉండొచ్చు.
అవసరమైన వారికి అమర్చి..
ఖమ్మంలో అవయవాల ట్రాన్స్‌ప్లాంటేషన్ (Organ Donation) జరగకపోయినా హైదరాబాద్ లాంటి నగరాల్లో వీటికి సంబంధించి కో ఆర్టినేటర్లు ఉంటారు. వీరు ఆస్పత్రిలో బ్రెయిన్డ్ కేసుల సమాచారాన్ని స్వచ్చంద సంస్థలకు అందజేస్తారు. వారు వచ్చి మృతుడి కుటుంబీకులతో మాట్లాడి అవయవదానానికి ఒప్పిస్తారు. వారు అంగీకరిస్తే మృతుడి అవయవాలను అవసరమైన బాధితులకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తారు. మూత్రపిండాలు, కళ్లు, కాలేయం, గుండె లాంటి అవయవాలు అవసరమైన రోగులు ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకుని తమకు ప్రాణం పోసే వారి కోసం ఎదురుచూస్తుంటారు.
బ్రెయిన్‌డెడ్ అయితే...! -
ప్రమాదాలు జరిగినప్పుడు కొన ఊపిరితో ఉండగా ఆస్పత్రులకు తీసుకొస్తుంటారు. ఆ వ్యక్తిని బతికించేందుకు వైద్యులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ ఒక్కోసారి పరిస్థితి చేయిదాటి క్షతగాత్రులు బ్రెయిన్ డెడ్ అవుతుంటారు. (బ్రెయిన్ డెడ్ అంటే మెదడు పనిచేయడం ఆగిపోతుంది. అంటే వ్యక్తి చనిపోయినట్లేనని డాక్టర్ల నిర్ధారణ చేస్తారు) అలాంటప్పుడు వారి అవయవాలు 12 గంటలలోపు మరో వ్యక్తికి అమర్చాలి. అప్పటి వరకు వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తారు. ఖమ్మం జిల్లాలో ఓ నేత్ర, అవయవ, శరీరదానాల సంఘం ఆధ్వర్యంలో 14 మృతదేహాలను మెడికల్ కాలేజీ విద్యార్థుల అధ్యయనం కోసం దానం చేశారు. ఇంకా 16మంది తమ శరీరాన్ని దానం చేసేందుకు అంగీకారాన్ని తెలిపారు. ఇక సత్తుపల్లి నుంచి ఒకరు, భద్రాద్రి జిల్లా రామవరం నుంచి ఒకరు, ఖమ్మం నుంచి ఇద్దరు జీవనధార యాప్‌లో నమోదు చేసుకున్నారు. ఇక జిల్లాలో ఇప్పటి వరకు వేలాది మంది నేత్రాలను దానం చేశారు.
వయసుతో సంబంధం లేదు
అవయవాలను దానం చేసేందుకు వయసుతో సంబంధం లేదు. ఎవరైనా ఎప్పుడైనా తమ అంగీకారాన్ని తెలుపుతూ పత్రాన్ని ఇవ్వొచ్చు. దీనికి సంబంధించిన నమోదు ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. తాము అవయవదానం చేయాలనుకుంటున్నామంటూ పౌండేషన్‌ను ఆశ్రయించి అంగీకారపత్రం ఇస్తే చాలు వారు పూర్తి చిరునామాతో సహా సమాచారాన్ని తీసుకుని డోనర్ కార్డును ఇస్తారు. అయితే కచ్చితంగా ప్రతీ ఒక్కరూ ఈ విషయాన్ని తమ కుటుంబీకులకు తెలపాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలామంది కుటుంబాల్లో అవగాహన లేకపోవడం కారణంగా జిల్లాలో ఈ కార్యక్రమం ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
ఎవరైనా ముందుకు రావొచ్చు: డాక్టర్ కంభంపాటి నారాయణరావు, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు
కిడ్నీ, కాలేయం లాంటి అవయవాలు సరైనసమయంలో దొరక్క ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. స్వచ్చంద సంస్థలు ముందుకు వస్తున్నా.. అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. ఓ మంచి పనిచేసేందుకు వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా అవయవదానం చేసేందుకు అంగీకారం తెలపొచ్చు. అవయవదానానికి ప్రత్యేకంగా జీవన్‌దార యాప్‌లో నమోదు చేసుకోచ్చు.
ఇంకా అవగాహన పెంచాలి: మాధవరపు నాగేశ్వరరావు, తెలంగాణ నేత్ర, అవయవ, శరీరదానాల సంఘం నాయకుడు
జిల్లాలో యువతకు, ప్రజలకు అవయవదానంపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎవరైనా శరీరాన్ని, అవయవాన్ని దానం చేస్తే ఆ విషయాన్ని కుటుంబీకులకు తెలియజేయాల్సి ఉంది. అలా లేనిపక్షంలో ఆ వ్యక్తి కుటుంబీకులతో మరణం తర్వాత ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
గణేశ్ మండపాల జియో ట్యాగింగ్ తప్పనిసరి
ఆ ఏరియాల్లో 10 గంటల నుంచి విద్యుత్ సరఫరా బంద్..
Read latest Telangana News And Telugu News