Minister Thummala: పెరుగుతున్న మున్నేటి వరద ప్రవాహం.. అధికారులని అలర్ట్ చేసిన మంత్రి తుమ్మల
ABN , Publish Date - Jul 24 , 2025 | 07:46 PM
గత ఏడాది కనీవిని ఎరుగని రీతిలో మున్నేటికి వరద ముప్పు రావడంతో వందలాది మంది నిరాశ్రయులుగా మారారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మళ్లీ అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు.
ఖమ్మం: జిల్లాలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో మున్నేటి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఖమ్మంతోపాటు మున్నేటికీ ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తోండటంతో మున్నేరుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. నగరంలో మున్నేటి వరద ప్రవాహాన్ని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) ఇవాళ(గురువారం జులై 24) పరిశీలించారు. మున్నేటి వరద పరిస్థితిని పరిశీలించి అక్కడి నుంచే అధికారులతో మాట్లాడారు మంత్రి తుమ్మల నాగేశ్వరావు. జిల్లా కలెక్టర్ అనుదీప్, ఉన్నతాధికారులతో మాట్లాడి యంత్రాంగమంతా అప్రమత్తం కావాలని ఆదేశించారు.
గత ఏడాది కనీవిని ఎరుగని రీతిలో మున్నేటికి వరద ముప్పు రావడంతో వందలాది మంది నిరాశ్రయులుగా మారారని చెప్పుకొచ్చారు. మళ్లీ అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. మున్నేటి పరివాహ ప్రాంతాల ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని కోరారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజల రక్షణ కోసం చేపట్టాల్సిన అన్ని రకాల చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులకి మార్గనిర్దేశం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
ఎక్కడ ప్రాణ, ఆస్తి నష్టం జరగడానికి వీల్లేదని.. అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని నిర్ధేశించారు. వర్షాల పరిస్థితి ఎలా ఉంది.. మున్నేటికి వరద ప్రవాహం ఏవిధంగా కొనసాగుతోందనే విషయంపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్ష జరపాలని ఆదేశించారు. అత్యవసర సమాచారాన్ని తనతోపాటు ప్రభుత్వ యంత్రాంగానికి ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే
మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు
Read latest Telangana News And Telugu News