Local Body Elections: ఓట్ల కోసం.. కాసుల వేట!
ABN , Publish Date - Dec 08 , 2025 | 07:37 AM
ఓట్ల కోసం కాసుల వేట మొదలైంది. మొదటి విడత ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుండడంతో... ఉమ్మడి జిల్లాలో పంచాయతీ బరిలో ఉన్న అభ్యర్థులకు 'డబ్బు' టెన్షన్ మొదలైంది. ఇప్పటికే వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు సొమ్ముల వేట మొదలెట్టారు.
డబ్బు వెదుకులాటలో పంచాయతీ బరిలో ఉన్నఅభ్యర్థులు
ఓట్ల కొనుగోలు కోసం వార్డుల వారీగా లెక్కలు
మేజర్ పంచాయతీల్లో రూ.కోటికి పైనే ఖర్చు
ఉమ్మడి జిల్లాలో గరంగరంగా రాజకీయం
ఖమ్మం, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఓట్ల కోసం కాసుల వేట మొదలైంది. మొదటి విడత ఎన్నికలకు (Local Body Elections) అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుండడంతో... ఉమ్మడి జిల్లాలో పంచాయతీ బరిలో ఉన్న అభ్యర్థులకు 'డబ్బు' టెన్షన్ మొదలైంది. ఇప్పటికే వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు సొమ్ముల వేట మొదలెట్టారు. ఓటుకు కనీసం రూ.500 నుంచి 1000తో పాటు పంచాయతీ పోరు ప్రతిష్టాత్మకంగా ఉన్న చోట మరింతగా కాసులు ఇచ్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గంలో పంచాయతీ పోరు రూ.కోట్లకు పడగలెత్తే పరిస్థితి ఉంది. దీంతో ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎవరికి వారు పంచాయతీలోని వార్డుల వారీగా ఓట్ల లెక్కలు వేసుకుంటున్నారు.. అదే సమయంలో కేటగిరీలుగా విభజించుకుంటున్నారు. డబ్బులు ఎవరికి ఇవ్వాలి!? గిప్టులు ఎవరికి పంచాలి? ఓటర్ల వారీగా జాబితాలు సిద్ధం చేస్తున్నారు!? నేరుగా ఓటర్లకే డబ్బులు బహుమతులు అందేలా ఇప్పటి నుంచే ప్రధాన పార్టీల అభ్యర్ధులు సిద్ధం చేసుకుంటున్నారు. మొదటి విడతలో 20 పంచాయతీలు, రెండో విడతలో 22 పంచాయతీలు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే.
మూడో విడత కూడా కొన్ని పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి. ఏకగ్రీవ పంచాయతీల్లో అదికార కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. పోటీ ఉన్న పంచాయతీల్లోనే డబ్బులు భారీగానే ఖర్చయ్యే పరిస్థితి నెలకొంది. రిజర్వ్ పంచాయతీల్లో రూ. 25 లక్షలు, బీసీ, జనరల్ చిన్న పంచాయతీల్లో రూ.50 లక్షలు, మేజర్ పంచాయతీల్లో కోటి రూపాయలకు పైగానే అభ్యర్థులు ఖర్చు చేసే పరిస్థితి ఉమ్మడి జిల్లాలో కనిపిస్తోంది. మొదట్లో సర్పంచ్ పదవికి ఇష్టపడే చాలామంది నామినేషన్లు వేశారు. కొందరు పార్టీ నుంచి సహాయం అడుగుతుండగా.. మరికొందరు వ్యక్తిగత ఖర్చుకు సైతం సై అంటున్నారు. బంధువులు, మిత్రుల వద్ద కొందరు, భూములు ఇతర ఆస్తులు పెట్టి కొందరు సొమ్ముల కోసం కుస్తీ పడుతున్నారు.
మొదటి విడత 11వ తేదీన, రెండో విడత 14న మూడో విడత 17న మధ్యాహ్నం వరకు పోలింగ్. ఆతర్వాత సాయంత్రం అదే పంచాయతీలో కౌంటింగ్ నిర్వహిస్తారు. దీంతో పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష నేతలంతా ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో బిజీ బిజీగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ పట్టణాలకు ఎన్నికలు లేకపోవడంతో.. పట్టణాల నేతలు పల్లె రాజకీయాల్లో తలమునకలయ్యారు. నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మె ల్యేలు, మండల నాయకులు పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కుల సంఘాల నాయకులను, పరపతి పలుకుబడి ఉన్న నేతలను మచ్చిక చేసుకొని పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు సాధించే పనుల్లో ఉన్నారు.
ఓట్లు వస్తాయని అనుకున్న చోట గ్రామాభివృద్ధికి హామీలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల బిల్లులు మంజూరు చేయించడం, చోట మోటా కాంట్రాక్టర్లతో పాటు గ్రామాల్లో గేమ్ చేంజర్ పెద్దలను కూడా తమ వైపునకు తిప్పుకునేందుకు వ్యవహారాలు నడిపిస్తున్నారు. విపక్ష పార్టీల నేతలు కూడా గత పరిచయాలను దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో సర్పంచ్, ఉపసర్పంచ్ పదవులు దక్కేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మొత్తమ్మీద పంచాయతీ తొలి విడత ఎన్నికల ప్రచార ప్రక్రియ సాగుతుండగా.. రెండో విడత ఎన్నికల ప్రచార ఘట్టం మొద లైంది. మరోవైపు.. మూడో విడత బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్తులకు అలర్ట్.. టీటీడీ మరో కీలక నిర్ణయం
గాంధీ, నెహ్రూలపై బీజేపీ విష ప్రచారం.. జగ్గారెడ్డి ఫైర్
Read Latest Telangana News and National News