Vemulawada Temple: వేములవాడ ఆలయంలో దర్శనాల నిలిపివేత.. భక్తుల ఆగ్రహం
ABN , Publish Date - Nov 12 , 2025 | 06:39 AM
వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఆలయంలోని కోనేరులో స్నానం చేసి దర్శనం చేసుకుంటారు. స్వామివారికి మొక్కులు చెల్లిస్తుంటారు. అయితే ఇవాళ దేవుడి దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో భక్తులు ఆందోళనకు దిగారు.
రాజన్న సిరిసిల్ల, నవంబరు12 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం (Vemulawada RajarajeshwaraSwamy Temple)లో భక్తుల దర్శనాలను నిలిపివేశారు. ఆలయ అధికారులు ముందస్తు ప్రకటన లేకుండా దర్శనాలు నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయం ఎదుట స్వామివారి దర్శనం కోసం ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున భక్తులు నిరీక్షించారు. ఆలయ ప్రధాన గేటుకు కూడా అధికారులు తాళం వేయడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన గేటు నుంచి ఆలయం లోపలికి వెళ్లకుండా అడ్డంగా రేకులు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో భక్తులు ఆలయం ఎదుట ఆందోళనకు దిగారు.
అయితే, రాజన్న ఆలయం ఎదుట ప్రచార రథంపై స్వామివారి దర్శనం కల్పించారు. ఎల్ఈడీ తెరపై స్వామివారి దర్శనం భక్తులకు కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ఆలయ విస్తరణలో భాగంగా ఇప్పటికే భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు రాజరాజేశ్వరస్వామి స్వామి ఆలయ అధికారులు. ఎంతో దూరం నుంచి వచ్చి స్వామివారికి మొక్కు చెల్లిందమని వస్తే ఆలయ అధికారులు ఇలా చేయడం భావ్యం కాదని భక్తులు మండిపడుతున్నారు. ఇంత చలిలోనూ స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నామని.. అయినా అధికారులు కనికరించడం లేదని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
Read Latest Telangana News And Telugu News