Congress: వాళ్లు మొగోళ్లు కాదు.. ఆడోళ్లు కాదు
ABN , Publish Date - Jul 05 , 2025 | 03:20 AM
రాజ్యాంగ రచన జరిగినప్పుడు సోషలిజం, సెక్యులరిజం అనే పదాలు లేవని.. మధ్యలో చేర్చిన ఆ పదాలను తొలగించాలని ఆర్‌ఎస్ఎస్ సభ్యుడొకరు కోరుతున్నారు.
బీజేపీ రాజ్యాంగంలోనే లౌకిక, సామ్యవాదం
ఆ పార్టీకి, మోదీ, షాకు దమ్ముంటే రాజ్యాంగం నుంచి ఆ రెండు పదాలనూ తొలగించాలి
ఇది నా సవాల్: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే
మోదీ సర్కారు పాటిస్తున్న విదేశాంగ విధానం వల్ల దేశం చుట్టూ శత్రువులే ఉన్నారని ధ్వజం
పీవోకేను ఇంకా ఎందుకు లాక్కోలేదని నిలదీత
హైదరాబాద్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ‘‘రాజ్యాంగ రచన జరిగినప్పుడు సోషలిజం, సెక్యులరిజం అనే పదాలు లేవని.. మధ్యలో చేర్చిన ఆ పదాలను తొలగించాలని ఆర్‌ఎస్ఎస్ సభ్యుడొకరు కోరుతున్నారు. తొలగిస్తామంటున్నారు. నేను సవాల్ చేస్తున్నా. మీరుగానీ, మీ బీజేపీగానీ, మీ మోదీ, మీ షా.. ఎవరూ రాజ్యాంగం నుంచి ఆ పదాలను తొలగించలేరు. ఇది నా సవాల్. మీకు తొలగించే దమ్ముందా? మీ బీజేపీ రాజ్యాంగంలోనే రెండో అధికరణంలో సెక్యులరిజం, సోషలిజం అనే పదాలున్నాయి. మరి మీరెందుకు ఆ పదాలను మీ పార్టీ రాజ్యాంగంలో ఎందుకు రాసుకున్నారు?’’ అని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. ‘‘ఎందుకంటే.. వీరంతా ఇటు మగోళ్లు కాదు.. అటు ఆడోళ్లు కాదు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్బీస్టేడియంలో జరిగిన సామాజిక న్యాయ సదస్సును ఆయనప్రారంభించి, ప్రసంగించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చిన ఆయన.. రానున్న రోజుల్లో కేంద్రంలో అధికారంలోకి రానున్నామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ఆ ఘనత పార్టీ కార్యకర్తలదేనన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పేద వర్గాలు, రైతులు, యువత, మహిళలకు న్యాయం జరిగిందన్నారు. కేంద్రంలో 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ.. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ఖర్గే ధ్వజమెత్తారు. ‘‘అధికారంలోకి రాగానే విదేశాల నుంచి నల్లధనం తెప్పించి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామని ఇచ్చిన హామీని అమలు చేశారా? ఏటా 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.. ఇచ్చారా? రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇస్తామని ప్రకటించారు.. ఇచ్చారా?’’ అని ఖర్గే నిలదీశారు. కేంద్రంలో నెహ్రూ, ఇందిరాగాంధీ అధికారంలో ఉన్న సమయంలోనే హైదరాబాద్ చుట్టూ పక్కల ప్రాంతాల్లో 50కి పైగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయని.. అవేవీ మోదీ ఏర్పాటు చేసినవి కావని గుర్తుచేశారు. మోదీ సర్కారు విదేశాంగ విధానంపైనా ఖర్గే నిప్పులు చెరిగారు. ‘‘మీ విదేశాంగ విధానం సరిగ్గా లేదు. దీనివల్ల దేశం చుట్టూ శత్రు దేశాలే ఉన్నాయి. పాకిస్థాన్, చైనా.. చివరికి నేపాల్ కూడా దేశానికి దూరమయింది.’’ అని మండిపడ్డారు.
పీవోకేను ఎందుకు లాక్కోలేదు
పహల్గాంలో ఉగ్రదాడి జరిగితే.. అన్ని రాజకీయ పక్షాలూ దేశం కోసం జవాన్లకు మద్దతు ప్రకటించాయని ఖర్గే గుర్తుచేశారు. ‘‘అఖిల పక్ష సమావేశం పెట్టాలని మేం పదే పదే కోరితే... ఏడుస్తూ అందుకు అంగీకరించారు. తీరా ప్రధాని మోదీ ఆ సమావేశానికి హాజరుకాకుండా ఎన్నికల ప్రచారం కోసం బిహార్‌కు వెళ్లారు. ఇదేనా మీ దేశభక్తి’’ అని దుయ్యబట్టారు. ‘‘పాకిస్థాన్‌ను నాశనం చేస్తాం... నాశనం చేస్తాం అంటూ ఎన్నికల్లో ప్రచారం చేస్తుంటారు? యుద్ధం జరిగినప్పుడు ఎందుకు నాశనం చేయలేదు. మధ్యలో ఎందుకు వదిలేశారు? అధికారంలోకి రాగానే ఆర్నెల్లలో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)ను లాక్కుంటామని ప్రకటించారు? ఇంకా ఎందుకు లాక్కోలేదు? భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపినట్టు ట్రంప్ చెబుతున్నారు. దీనిపై మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు?’’ అని ప్రశ్నించారు. అమెరికాతో పాటు ప్రపంచ దేశాలన్నీ ఒక్కటై బెదిరించినా లొంగకుండా ఇందిరాగాంధీ పాకిస్థాన్‌ను రెండు ముక్కలు చేసి, బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించారని గుర్తుచేశారు. ‘‘దేశ ప్రజల కోసం మహాత్మాగాంధీ, ఇందిర, రాజీవ్ ప్రాణాలిచ్చారు. మీ ఇంట్లో ఎవరైనా ఇచ్చారా? ఆర్‌ఎ్‌సఎస్ నుంచి ఒక్కరైనా దేశం కోసం ప్రాణాలు ఇచ్చారా?’’ అని ఖర్గే నిలదీశారు. 42 దేశాల్లో తిరిగిన మోదీ ఒక్కసారి మణిపూర్‌కు వెళ్లలేదని ఖర్గే మండిపడ్డారు. ‘‘ఎన్నిరోజులు మణిపూర్‌కు వెళ్లకుండా ముఖం చాటేస్తారు? ఆ రాష్ట్రం దేశంలో భాగం కాదా?’’ అని నిలదీశారు. ‘
ప్రజల మాటే మా మాట
ప్రధాని మోదీ తన మనసులో ఏముందో చెప్పడానికి ‘మన్ కీ బాత్’ అంటారని.. తాము మాత్రం ప్రజల గుండెల్లో ఏముందో అదే చెబుతామని.. తమది ‘దిల్ కీ బాత్’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. చెప్పడమే కాక.. తాము చేసి చూపిస్తామని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం 11 ఏళ్లలో అన్ని వ్యవస్థలను దెబ్బతీసిందన్న ఆయన.. మళ్లీ కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే దేశ స్వరూపాన్ని సమగ్రంగా మార్చుతామన్నారు. ‘‘గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అవినీతి పేరుతో ఏ విధంగా దోచుకుందో మనమంతా చూశాం. ఆ పార్టీ అవినీతి మీకు తెలియంది కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తెలంగాణకు, హైదరాబాద్‌కు చేసిందేం లేదు. హైదరాబాద్‌కు ఐటీని ఎవరు తెచ్చారు? నెహ్రూ, ఇందిరా హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశాం. తెలంగాణకు మీరు (బీజేపీ) చేసిందేంటీ? సోనియాగాంధీ చొరవతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు.
దేశానికి ఆదర్శంగా తెలంగాణ
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తొలిసారిగా కులగణన చేయించిందని ఖర్గే గుర్తుచేశారు. ఉపాధి, సామాజిక న్యాయం అందించాలనే ఉద్దేశంతోనే ఆ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని.. కులగణనతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. జనాభా దామాషా ప్రకారం బీసీ వర్గాలకు రిజర్వేషన్లు అందించడానికి కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని.. బీసీలకు రిజర్వేషన్లు ఇప్పించేదాకా తాము విశ్రమించబోమని ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు కూడా మరింత అప్రమత్తంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా.. రేవంత్ సర్కారు రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల గురించి ఖర్గే ప్రస్తావించారు. రైతు భరోసా కింద 15 ఎకరాల దాకా వ్యవసాయ భూములు ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.8265 కోట్లు వేశామన్నారు. రాష్ట్రంలోని 4.5 లక్షల మంది గిగ్ వర్కర్ల కోసం చట్టం తేనున్నామని.. ప్రతి పేదవాడికీసహాయం చేయనున్నామని హామీఇచ్చారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో అన్ని రాష్ట్రాల్లో రోహిత్ వేముల చట్టాన్ని తెస్తామని రాహుల్ గాంధీ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసిన ఖర్గే.. దానికి అనుగుణంగా చట్టం తెస్తామని వెల్లడించారు. తెలంగాణలో ప్రతి చోటుకూ, ప్రతి గడపకూ జై బాపు, జై సంవిధాన్ నినాదంతో వెళ్దామన్నారు.
మోదీ లేడుగా... భయమెందుకు?
ఖర్గే ప్రసంగం ముగింపులో.. జై కాంగ్రెస్, జై హింద్ అనే నినాదాలు చేస్తూ సభకు హాజరైన కార్యకర్తలతో కూడా అవే నినాదాలు ఇప్పించారు. కొందరి నుంచి స్పందన రాకపోవడంతో.. ‘‘సభకు మోదీ రాలేదు కదా మీరెందుకు భయపడుతున్నారు?’’ అంటూ వారితో నినాదాలు చేయించారు. సభ ముగిసిన అనంతరం ఆయన 5.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు.
రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ కుట్ర పదేళ్లలో అడ్డగోలుగా బీఆర్‌ఎస్ దోపిడీ: భట్టి
ఒకవైపు రాజ్యాంగ రక్షణ కోసం కాంగ్రెస్, ఇండియా కూటమి పోరాడుతుంటే.. మరోవైపు, రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ, ఎన్డీఏ కూటమి కుట్రలు చేస్తున్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ‘సామాజిక న్యాయ సమరభేరి సభ’లో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగమంటే కేవలం ఒక పుస్తకం కాదని, దేశ ప్రజల అవసరాల కోసం రూపొందించిన అద్భుత గ్రంథమని పేర్కొన్నారు. రాజ్యాంగమే లేకపోతే దేశంలోని పేదలు, సామాన్యులు, దళితులు, గిరిజనులకు ఎలాంటి హక్కులు ఉండేవి కావని చెప్పారు. రాజ్యాంగాన్ని నిలబెట్టుకుంటేనే అందరికీ భవిష్యత్తు ఉంటుందన్నారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ అడ్డగోలుగా దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. ఇక, కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి సామాజిక న్యాయ సూత్రాన్ని పాటిస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి
స్టాక్ మార్కెట్‌లో భారీ కుంభకోణం..జేన్ స్ట్రీట్‌పై సెబీ చర్యలు
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి