Share News

By-election: టార్గెట్‌.. జూబ్లీహిల్స్‌.. విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీల వ్యూహాలు

ABN , Publish Date - Sep 13 , 2025 | 10:22 AM

జూబ్లీహిల్స్‌ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే నాయకులు, కార్యకర్తలను నియోజకవర్గంలో మోహరించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్‌ శాసనసభ స్థానం ఖాళీ అయింది.

By-election: టార్గెట్‌.. జూబ్లీహిల్స్‌..  విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీల వ్యూహాలు

- ఇప్పటికే మోహరించిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌

- త్వరలో డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించనున్న బీజేపీ

- ఆ రెండు పార్టీలకు అభ్యర్థులు ఎవరు?

- పరిశీలనలో పలువురి పేర్లు

హైదరాబాద్‌ సిటీ: జూబ్లీహిల్స్‌ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే నాయకులు, కార్యకర్తలను నియోజకవర్గంలో మోహరించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌(MLA Maganti Gopinath) ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్‌ శాసనసభ స్థానం ఖాళీ అయింది. త్వరలో ఎన్నికల నిర్వహణ ఉంటుందన్న సంకేతాలను ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది.


city6.2.jpg

ఈనెల 30వ తేదీన తుది ఓటరు జాబితా ప్రకటించనుండగా, ఆ తర్వాత ఎప్పుడైనా ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ప్రకటించే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ఇది రెండో ఎన్నిక. రెండు కూడా గ్రేటర్‌ పరిధిలోని నియోజకవర్గాలు కావడం గమనార్హం. గతంలో కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌లో బోణి కొట్టని కాంగ్రెస్‌.. కంటోన్మెంట్‌లో విజయం సాధించి సత్తా చాటింది. ఇప్పుడూ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లోనూ అవే ఫలితాలు పునరావృతం చేయాలని అధికార పార్టీ భావిస్తోంది.


వ్యూహాత్మకం.. గెలుపు లక్ష్యం...

ఉప ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా వ్యూహాత్మకంగా పార్టీలు ముందుకు సాగుతున్నాయి. అభ్యర్థి ఎంపిక నుంచి క్షేత్రస్థాయిలో ప్రణాళికల రూపకల్పన, అమలు వరకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాయి. నియోజకవర్గంలో పార్టీ బలాబలాలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఏ ప్రాంతంలో ఏ నాయకుడికి బాధ్యతలు అప్పగించాలన్న దానిపైనా ప్రత్యేకంగా దృష్టి సారిస్తుండడం గమనార్హం. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌లకు ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలనూ భాగస్వాములను చేస్తున్నారు.


city6.3.jpg

బీఆర్‌ఎస్‌, బీజేపీ ఇలా..

బీఆర్‌ఎస్‌ డివిజన్ల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించింది. ఐదు బూత్‌లకో కార్పొరేటర్‌/మాజీ కార్పొరేటర్‌, సీనియర్‌ నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే పార్టీ శ్రేణులతో వారు సమావేశాలు నిర్వహిస్తున్నారు. గులాబీ పార్టీ నుంచి దివంగత గోపినాథ్‌ సతీమణి మాగంటి సుజాత బరిలో దిగుతుందని ఇప్పటికే కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సంకేతాలిచ్చారు. దీంతో ఆమె కాలనీలు, బస్తీల్లో గోపినాథ్‌ సంతాపసభలు నిర్వహిస్తున్నారు. గోపినాథ్‌ తనయలూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఉప ఎన్నికల్లో విజయం లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. పార్టీ కార్యకర్తలతో రెండు పర్యాయాలు నాయకులు ఉప ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు.


అభ్యర్థులు ఎవరు?

కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అధికార పార్టీ నుంచి నవీన్‌ యాదవ్‌, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, రహ్మత్‌నగర్‌ కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి పేరు కూడా తాజాగా తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ జూబ్లీహిల్స్‌ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా, ఆయన దానిని కొట్టి వేశారు. బీజేపీ నుంచి లంకల దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మాధవీలత, డాక్టర్‌ పద్మవిపనేని, మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు మనుమడు ఎన్‌వీ సుభాష్‌ అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న దానిపై సస్పెన్స్‌ నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

రూ.12 వేల కోట్లు కాదు.. రూ.12 కోట్లే!

Read Latest Telangana News and National News

Updated Date - Sep 13 , 2025 | 11:53 AM