Drug Seizure: రూ.12 వేల కోట్లు కాదు.. రూ.12 కోట్లే!
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:41 AM
మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్‌లో జరిపిన ఆపరేషన్‌పై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చర్లపల్లిలో అక్రమంగా నడుస్తున్న రసాయన పరిశ్రమపై...
హైదరాబాద్‌లో పట్టుకున్న డ్రగ్స్ ముడి పదార్థాల విషయంలో మహారాష్ట్ర పోలీసుల ప్రచారంపై రాష్ట్ర పోలీసుల అభ్యంతరం
ఈ అంశంపై ఇంటెలిజెన్స్, ఎక్సైజ్‌శాఖ అధికారుల విచారణ
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్‌లో జరిపిన ఆపరేషన్‌పై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చర్లపల్లిలో అక్రమంగా నడుస్తున్న రసాయన పరిశ్రమపై దాడిచేసి మాదకద్రవ్యాలను స్వాదీనం చేసుకోవడం అభినందనీయం అయినప్పటికీ.. పట్టుకున్న రసాయనాల విలువపై చేస్తున్న ప్రచారంపై తెలంగాణ పోలీసు, ఎక్సైజ్ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముంబయి పోలీసులు పట్టుకున్న 5.790 కిలోల డ్రగ్ విలువ రూ.11.58 కోట్లు మాత్రమేనని మిగిలిన కెమికల్స్, ఇతర సామగ్రి విలువ కలిపినా మొత్తం రూ.12 కోట్లకు మించదని రాష్ట్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఈ ముడి పదార్థాలతో రూ.12వేల కోట్ల విలువైన డ్రగ్స్ తయారు చేయవచ్చంటూ ముంబయి పోలీసులు చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. దీనిపై తెలంగాణ ఇంటెలిజెన్స్, ఎక్సైజ్‌శాఖ అధికారులు విచారణ చేపట్టారు. కాగా.. చర్లపల్లిలో నిర్వహిస్తున్న ఆ డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీకి ఎలాంటి అనుమతులూ లేవని తేలింది. నాచారంలో 2017లో ఒక ఫ్యాక్టరీ కోసం దువ్వూరి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి అనుమతి తీసుకున్నా.. అది ప్రారంభం కాకుండానే యాజమాన్యం ఓలేటి అజయ్, శ్రీనివాస్ అనే వ్యక్తుల పేరు మీదకు మారింది. వీరు నాచారం బదులు చర్లపల్లిలో అక్రమంగా ఈ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
మీరెందుకు గుర్తించలేకపోయారు?
ముంబై పోలీసులు డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేసిన వెంటనే మంత్రి జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి.. . ‘‘వారు ఇక్కడికి వచ్చి దాడులు చేసేదాకా మీరెందుకు గుర్తించలేకపోయార’’ని మంత్రి ప్రశ్నించినట్లు తెలిసింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించే అంశంపైనా మంత్రి వారితో చర్చించారు. అయితే.. అలా చేయడంవల్ల పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేసినట్లు అవుతుందనే అభిప్రాయాన్ని ఎక్సైజ్‌శాఖ అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.