Jubilee Hills by-election: గుడిలో ఓట్ల దండకం.. భక్తులను ఆకట్టుకునేందుకు అభ్యర్థుల ఆరాటం
ABN , Publish Date - Oct 31 , 2025 | 08:35 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ సమీపిస్తున్నా కొంతమంది అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. ఓటు బ్యాంక్‌లు కొల్లగొట్టేందుకు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆలయాలు, ప్రార్థన మందిరాలను కూడా వదలడం లేదు.
- కార్తీకమాసం భోజనాలు స్పాన్సర్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election) పోలింగ్ తేదీ సమీపిస్తున్నా కొంతమంది అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. ఓటు బ్యాంక్‌లు కొల్లగొట్టేందుకు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆలయాలు, ప్రార్థన మందిరాలను కూడా వదలడం లేదు. ఆలయాలు, మసీదులు, చర్చిలను సందర్శిస్తూ ఓటర్లను కలుసుకోవడంతో పనిలో పనిగా దేవుడిని గెలుపు కోసం ప్రార్థిస్తున్నారు.
కార్తీకమాసం కావడంతో ఆలయాలకు భక్తుల తాకిడి తీవ్రంగా ఉంటుంది. దీనిని అభ్యర్థులు అవకాశంగా మార్చుకున్నారు. రద్దీ అధికంగా ఉండే శివాలయాలను సందర్శిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్యను బట్టి ప్రసాదాలు వితరణ చేస్తూ తమకే ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. తొలి కార్తీక సోమవారం బీఆర్‌ఎస్, కాంగ్రెస్(BRS, Congress) అభ్యర్థులు ఎక్కువ సమయాన్ని ఆలయాలకు కేటాయించారు. ప్రత్యేక పూజలు చేయడంతో ప్రచారం నిర్వహించారు.

ఓ పార్టీకి చెందిన అభ్యర్థి కార్తీక పౌర్ణమి రోజున అఖండ దీపారాధన పేరిట ఆలయంలో ప్రత్యేక కార్యక్రమం పెట్టించి వనభోజనాల పేరిట వచ్చిన వారందరికీ భోజనాలు కూడా పెట్టించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరో అభ్యర్ధి కార్తీక పౌర్ణమి రోజున ప్రసిద్ధిగాంచిన ఓ ఆలయంలో భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించారు. మధ్యమద్యలో తానే భజన పెట్టించినట్టుగా ప్రకటించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్నికల కమిషన్‌కు దొరకకుండా పార్టీ పేరు చెప్పకుండా అభ్యర్థి పేరు మాత్రమే మైకులో వినిపించేలా చెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అయ్యప్పలకు స్పెషల్ సేవ
కార్తీక మాసం కావడంతో అయ్యప్ప దీక్షలు ఊపందుకున్నాయి. వేల సంఖ్యలో దీక్షలు తీసుకుంటుండడంతో కొంతమంది అభ్యర్థులు ఆయా ఆలయాలకు వెళ్లి దీక్షాపరులను కలిసి మద్దతు కోరుతున్నారు. ఇటీవల ఓ అభ్యర్థి అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించడంతో పాటు అన్నదానం కూడా చేశారు. నవంబరు 11న పోలింగ్ రోజు నియోజకవర్గం నుంచి శబరిమలకు వెళ్తున్న వారి వివరాలు సేకరించి వారితో ప్రయాణం వాయిదా వేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలింగ్ తేదీన 22 మంది భక్తులతో కూడిన బృందం శబరిమలకు రైలు టికెట్టు బుక్ చేసుకోగా నాయకులు వాటిని క్యాన్సిల్ చేసి బస్సు ఇచ్చి పంపిస్తామంటూ మాట ఇచ్చారు.

మత పెద్దల దీవెనలు
ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మసీదు, చర్చీల్లో కూడా రాజకీయ నేతల హడావుడి జోరందుకుంది. పాస్టర్లను కలుసుకొని ఆశీర్వాదం తీసుకుంటున్నారు. వారితో సమావేశం నిర్వహించి చర్చీల అభివృద్ధిపై చర్చిస్తున్నారు. మరోవైపు మసీదుల్లో జరిగే ప్రార్థనల్లో కూడా పాల్గొంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. రహ్మత్‌నగర్ గురుద్వారాలో జరిగిన వేడుకల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు హడావుడి చేశారు. ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మద్దతు కోరారు. నియోజకవర్గంలో సుమారు ఆరు వేల ఓట్లు ఉండడంతో ఉత్సవాలు జరిగిన మూడు రోజుల పాటు అభ్యర్థులు గురుద్వారాను సందర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫానును ఆపలేం... నష్టం తగ్గించాం
Read Latest Telangana News and National News