Donation: అమ్మపాల అమృతాన్ని పంచి..
ABN , Publish Date - Oct 31 , 2025 | 06:39 AM
నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేష్ఠం. కానీ.. అలాంటి శ్రేష్ఠమైన తల్లిపాలు నేడు చాలామందికి అందడం లేదు.
12 లీటర్ల తల్లిపాలు దానం చేసిన పేదింటి మహిళ
అనంతపురం మదర్స్ మిల్క్ బ్యాంక్‌కు అందజేత
అనంతపురం వైద్యం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేష్ఠం. కానీ.. అలాంటి శ్రేష్ఠమైన తల్లిపాలు నేడు చాలామందికి అందడం లేదు. ఇలా తల్లిపాల కొరత ఉన్న చిన్నారుల కోసం అనంతపురం జిల్లా కూడేరు మండల మరుట్లకు చెందిన లావణ్య ఏకంగా 12 లీటర్ల తల్లిపాలు దానం చేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్‌కు ఈ పాలను ఆమె గురువారం అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన నవీన్, లావణ్య దంపతులకు ఈ నెల 4న అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సాధారణ కాన్పులో కొడుకు పుట్టాడు. ఈ క్రమంలో డీసీఎస్ ఆర్‌ఎంఓ డాక్టర్ హేమలత, న్యూట్రీషనిస్టులు పల్లవి, రాధ మదర్స్ మిల్క్ బ్యాంక్ గురించి లావణ్యకు అవగాహన కల్పించారు. దీంతో ఆమె తన బిడ్డకు ఇవ్వగా మిగిలిన పాలను దానం చేస్తూ వచ్చారు. డిశార్జి అయి ఇంటికి వెళ్లాక కూడా డాక్టర్లు సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ పాలుపట్టి నిల్వ చేశారు. ఇలా ఫ్రిజ్‌లో దాచిన 12లీటర్ల పాలను మరుట్లకు వచ్చిన డాక్టర్ హేమలతకు లావణ్య అందజేశారు. లావణ్యను సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ హేమలత అభినందించారు.