Medical Negligence: మానవత్వం మరిచిన ఆస్పత్రి.. ఏమైందంటే..
ABN , Publish Date - Dec 19 , 2025 | 01:46 PM
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘన్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఓ ఆస్పత్రిలో చోటుచేసుకున్న అమానుష ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వైద్య చికిత్స కోసం వచ్చిన ఓ మహిళపై వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి, శస్త్రచికిత్సను మధ్యలోనే నిలిపివేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
మేడ్చల్ , డిసెంబరు19 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్ (Medchal) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘన్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఓ ఆస్పత్రిలో చోటుచేసుకున్న అమానుష ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వైద్య చికిత్స కోసం వచ్చిన ఓ మహిళపై వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి, శస్త్రచికిత్సను మధ్యలోనే నిలిపివేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ఘటనతో బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురై హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు.
అలియాబాద్ గ్రామానికి చెందిన ఓ మహిళ కొంతకాలంగా హెర్నియా సమస్యతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో సరైన వైద్యం అందుతుందనే నమ్మకంతో ఆమె నాలుగు రోజుల క్రితం సదరు ఆస్పత్రిలో చేరింది. హాస్పిటల్లో వైద్యులు మహిళకు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి, సర్జరీ తప్పనిసరి అని నిర్ధారించారు. ఆపరేషన్ విజయవంతంగా చేస్తామని కుటుంబ సభ్యులకు భరోసా కూడా ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు వైద్యుల మాటలను నమ్మి చికిత్సకు అంగీకరించారు.
అయితే ఆపరేషన్ ప్రారంభమైన కొంతసేపటికే వైద్యులు ఒక్కసారిగా శస్త్రచికిత్సను నిలిపివేశారు. సరైన పరికరాలు అందుబాటులో లేవని, సర్జరీ కొనసాగించడం సాధ్యం కాదని చెప్పి చేతులెత్తేశారు. శస్త్రచికిత్సను మధ్యలోనే ఆపివేయడంతో బాధితురాలు తీవ్ర శారీరక ఇబ్బందులు పడుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో వైద్యులు తమ బాధ్యత కాదని, పేషెంట్‌ను వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని నిర్లక్ష్యంగా సూచించారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఆపరేషన్‌ను మధ్యలో ఆపేసిన తర్వాత కూడా సరైన వైద్యం అందించకపోవడం, వేరే ఆస్పత్రికి తరలించడంలో సహకరించకపోవడం తీవ్ర అన్యాయమని వారు వాపోయారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులపై వైద్యులు తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆస్పత్రి నుంచి బయటకు తీసుకెళ్లాలని బెదిరించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో చేసేదేమీ లేక మహిళా బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ బిడ్డను కాపాడాలని, బాధ్యత లేని వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆస్పత్రి నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే తమ కుటుంబ సభ్యురాలి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపడతామని పోలీసులు ధైర్యం చెప్పారు. ఆస్పత్రి యాజమాన్యం, వైద్యుల పాత్రపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య నిర్లక్ష్యంపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగరేణి కార్మికుల సమస్యలు పట్టవా.. రేవంత్ ప్రభుత్వంపై కవిత ఫైర్
రామ్ సుతార్ మృతి శిల్ప కళకు తీరని లోటు: కేసీఆర్
Read Latest Telangana News and National News